సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:39

ఇంటి వద్దే కరోనా పరీక్షలు

ఇంటి వద్దే కరోనా పరీక్షలు

  • హైదరాబాద్‌లో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌
  • రోజుకొక ప్రాంతంలో సంచారం - నిత్యం 10 వేల పరీక్షల సామర్థ్యం
  • మొదటి రోజు వెయ్యిమందికి పరీక్షలు - నేడు చార్మినార్‌ ప్రాంతంలో టెస్టులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: ఇంటి వద్దే కరోనా పరీక్షలు చేయించుకొనే సౌకర్యం హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి వచ్చింది. నిత్యం 10 వేల మందికి టెస్టులుచేసే సామర్థ్యం గల మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌(బస్సు)ను గురువారం కార్వాన్‌ నియోజకవర్గంలో ప్రారంభించి వెయ్యిమందికి పరీక్షలు చేశారు. ముందుగా కంటైన్మెంట్‌జోన్లలో అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బస్సులో ప్రతిరోజు 10 వేల మందికి ఆర్టీపీసీఆర్‌ పద్ధతిన పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రాంతాలవారీగా రోజు 5 వేల పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు హైదరాబాద్‌ జిల్లావైద్యాధికారి డాక్టర్‌ వెంకటి చెప్పారు. పరీక్షల సామర్థ్యాన్ని క్రమంగా 10 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పీహెచ్‌సీ, యూహెచ్‌సీలో రోజుకు సుమారు 5 వేల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఒకేసారి 10 మందికి పరీక్షలు

మొబైల్‌ బస్సు ల్యాబ్‌లో ఒకేసారి 10 మందికి పరీక్షలు చేయవచ్చు. ఇందుకోసం 10 మంది టెక్నీషియన్లు, 10 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు వైద్యనిపుణులు అందుబాటులో ఉంటారు. ఆయా బస్తీల్లో సేకరించిన నమూనాలను ఉస్మానియా, గాంధీ, తదితర ప్రధాన వైరాలజీ ల్యాబ్‌లకు తరలించి అక్కడ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. 5 నుంచి 6 గంటల్లో ఫలితాలను వెల్లడిస్తున్నారు.  నియోజకవర్గాలవారీగా రోజుకో ప్రాంతంలో మొబైల్‌టెస్టింగ్‌ ల్యాబ్‌ సంచరిస్తూ పరీక్షలు నిర్వహించనున్నది. శుక్రవారం చార్మినార్‌ నియోజకవర్గంలో పరీక్షలు చేయనున్నారు.


ప్రాణాలు కాపాడటమే లక్ష్యం

కరోనా ప్రమాదకరం కాకపోయినప్పటికీ ఏ ఒక్కప్రాణం బలవ్వకూడదు. రోగుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యం. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ సహకరించాలి. నగరంలో పరీక్షలను మరింత పెంచాం. ఈ బస్సు ద్వారా ఏ రోజు ఏప్రాంతంలో పరీక్షలు చేస్తారో ముందురోజే అక్కడ ప్రచారంచేస్తున్నాం.  

- డాక్టర్‌ వెంకటి, హైదరాబాద్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి

కావాలనే విపక్షాల రచ్చ

  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ఫైర్‌


కరోనా విషయం లో ప్రభుత్వం చిత్తశుద్ధితో శ్రమిస్తున్నప్పటికీ విపక్షాలు కావాలనే రచ్చచేస్తున్నాయని వైద్యారోగ్యశాఖ మం త్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. వైరస్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ టెస్టులు చేస్తున్నామని, మొబైల్‌ టెస్ట్‌ ల్యాబ్‌ ద్వారా పరీక్షల నిర్వహణ మరింత అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ప్రజలంతా ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని, ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దని సూచించారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై వంటి నగరాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని, హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. పరీక్షల సంఖ్యను పెంచడంతో కొంతమేర కట్టడి చేయగలుగుతున్నామని తెలిపారు. దేశంలో పలురాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా కట్టడిలో కొంతమేర విజయం సాధించామని పేర్కొన్నారు.


logo