Supreme Court | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్గా పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో సమన్లు పంపినా హాజరలేదని.. విచారణకు సహకరించడం లేదని ఆరోపించింది. ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ఆప్ నేతలు, ఇతరులతో కలిసి నేరానికి పాల్పడ్డారని.. ఇందులో కేజ్రీవాల్ ప్రధానపాత్ర పోషించారని పేర్కొంది.
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి తొమ్మిదిసార్లు సమన్లు పంపినా ఒక్కసారి విచారణకు హాజరుకాలేదని పేర్కొంది. కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేశారు. కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. ఈ నెల 24లోగా సమాధానం చెప్పాలని ఈడీని ఆదేశించింది. కేసు విచారణను 29న జరుగనున్నది. కేజ్రీవాల్ తప్పు చేశారనేందుకు అధికారుల వద్ద సమగ్ర ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని ఈడీ కౌంటర్లో స్పష్టం చేసింది.