కాళేశ్వరం ’కూలేశ్వరం’ అని కారుకూతలు కూశారు. మహోన్నత జలసౌధాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్నెన్ని కుట్రలు, ఎన్నెన్ని కువారకాలు? జగత్ప్రసిద్ధమైన ఎత్తిపోతలపై అవాకులు, చవాకులు పేలారు. చిన్న పగుళ్లను పెద్ద భూతద్దంలో చూపి వీరంగం సృష్టించారు. బరాజ్లన్నీ నిరుపయోగమేనని బద్నాం చేసిన కాంగ్రెస్ పాలకులు ‘త్వమేవ శరణం’ అంటున్నారు. ‘కాళేశ్వరంపై సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే విషం కక్కడం తెలిసిందే. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ బట్టకాల్చి మీదేశారు. కమిషన్లు, విజిలెన్స్ విచారణలంటూ కాలహరణం చేశారు. కానీ ఇప్పుడు ‘అదంతా తూచ్’ అని ఆ కాళేశ్వర జలాల కోసమే దోసిలి పడుతున్నారు. నిన్నటివరకు దుమ్మెత్తిపోసిన నోటితోనే కాళేశ్వరానికి మరమ్మతులు చేసి కాలువలు నింపుతామంటున్నారు. రెండు నాల్కల ధోరణితో కొత్తపాట ఎత్తుకున్నారు.
జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి కాళేశ్వరానికి జైకొట్టినా కనిపించని కుట్రలు ఆగిపోలేదని గుర్తుంచుకోవాలి. ఇంతకాలం ఎందుకు తాత్సారం చేస్తూ వచ్చారో తెలుసుకుంటే అసలు కీలకం అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు మేడిగడ్డ మరమ్మత్తులు జరిగి జలాశయాలు పోటెత్తవు. 2027 వేసవిలోనే పనులు చేపడతారనే సూచనలు వెలువడుతున్నాయి. అంటే మరో ఏడాది పడావేనన్న మాట. ఈ లోగా ఏపీలో పోలవరం నిర్మాణం పూర్తయి 2028లో ప్రాజెక్టును కమిషన్ చేయాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాళేశ్వ రం బరాజ్‌లు నిండితే పోలవరం నీటమట్టాలకు కొరత ఏర్పడుతుంది. రబీ సీజన్ మొత్తం డెల్టాకు నీరు సరఫరా కావాలంటే కనీసం 60 టీఎంసీలు నింపడం అవసరం. అందుకే అవతలకు తగినంత నీరు పారిన తర్వాతే ఇక్కడ మరమ్మతులు చేయాలనేది తెలంగాణ సర్కారు ఆలోచనగా కనిపిస్తున్నది. గుట్టుగా గురువుకు శిష్యుడు సమర్పిస్తున్న దక్షిణ ఇది. వేరే మాటల్లో చెప్పాలంటే ఏపీ నీటి దొంగలకు సద్ది కట్టడమే.
తెలంగాణ సాధకుడు కేసీఆర్ రాష్ట్ర సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మన నీటి హక్కులు చెక్కుచెదరకుండా చూశారు. వలస పాలకులు మూలకు పడేసిన తెలంగాణ ప్రాజెక్టుల దుమ్ము దులిపి పరుగులు పెట్టించారు. మేధోమథనం చేసి కర్తవ్యబోధ జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అద్వితీయమైన రీతిలో దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పరంపరతో తెలంగాణ నీటిగోసకు శాశ్వత పరిష్కారం చూపారు. మూడేండ్లలోనే పూర్తిచేసి రికార్డు సృష్టించారు. గోదావరి జలాలను కొండలెక్కించి, నీరు పల్లమెరుగు అనే సూత్రాన్ని తలకిందులు చేశారు. ఫలితంగా తెలంగాణలో నీరు పారింది, తీరు మారింది. పచ్చదనం వెల్లివిరిసింది. సాగు పండుగయ్యింది. ఏపీ పాలకుల జలదోపిడీ కుట్రలను తిప్పికొట్టే వ్యూహంతో కేసీఆర్ ఇదంతా చేశారు. కానీ తెలంగాణ సోయిలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ ముద్రను చెరిపివేయాలనే దుగ్ధతో రాష్ట్ర నీటి హక్కులను తాకట్టు పెట్టేందుకు తయారయ్యింది. మన ప్రాజెక్టులను కుంటిసాకులతో పడావు పెట్టి, పొరుగువారి జలాశయాలు నింపే ఏజెంటుగా మారిపోయింది. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. కుళ్లు రాజకీయాలకు తెలంగాణ జలభద్రతను బలిపెట్టడం ఏమాత్రం భావ్యం కాదు.