దుండిగల్, ఫిబ్రవరి 24 : కన్నప్రేమ కర్కశంగా మారింది. తన రెండు నెలల చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి మండుతున్న కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. ఈ అత్యంత పాశవిక ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని నవ్వగవకు చెందిన రాజేంద్ర ఆదివాసీ(21), మమత అహిర్వార్(20) ప్రేమవివాహం చేసుకున్నారు. వీరు పొట్టకూటి కోసం నగరానికి వచ్చి బౌరంపేట సమీపంలోని సనారెల్లి అపార్ట్‌మెంట్స్‌లో కూలీలుగా పనిచేస్తునారు. వీరికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయం రాజేంద్ర పనికోసం బయటకు వెళ్లిన సమయంలో బాబు తీవ్రంగా ఏడ్వడంతో విసుగు చెందిన మమత.. రాజేంద్ర ఇంటికి వచ్చేసరికి మమత కొడుకును మంటల్లో వేసి కాల్చుతుండటం చూసి షాకయ్యాడు. తన భార్యనే బాబును కాల్చి చంపిందని రాజేంద్ర ఫిర్యాదు చేశాడు.
రాజన్న సిరిసిల్ల ఫిబ్రవరి 24:( నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అద్దె ఇంటి కష్టాలు మరోసారి కలచివేస్తున్నాయి. పట్టణంలోని మారండేయ వీధిలో మామిడాల వీరమ్మ (80) మంగళవారం మృతిచెందింది. ఆమె భర్త విశ్వనాథం గతంలోనే మరణించగా, ఇద్దరు కొడుకులు పాండు, బాలరాజు, కూతురు కళావతి ఉన్నారు. మారండేయ వీధిలో ఓ ఇంట్లో కొంతకాలంగా కొడుకు బాలరాజుతోపాటు వీరమ్మ ఉంటున్నది. బాలరాజు భార్య వేరుగా ఉంటుండగా, అతడు టెక్స్టైల్పార్లో కార్మికుడిగా పనిచేస్తూ తల్లిని చూసుకుంటున్నాడు. మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన వీరమ్మ మృతి చెందింది. విషయం ఇంటి యజమానికి తెలుపగా, మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక రోడ్డుపైన ఓ బల్లపై మృతదేహాన్ని ఉంచారు. బాలరాజుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ అడిచర్ల రూపసాయి స్థానికుల సహకారంతో సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించారు.
మోత్కూరు, ఫిబ్రవరి 24: ఆస్తి కోసం ఓ మరిది తన వదిన గొంతు కోసిన ఘటన యాదాద్రిభవనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగులో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు .. గ్రామానికి చెందిన బొంత నర్సింహ తమ్ముడు అశోక్ మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది. నర్సింహ అనారోగ్యంతో నిరుడు మృతి చెందారు.భూ వివాదం కోర్టులో ఉండగా, గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతున్నది. తనకు రావాల్సిన ఆస్తి వాటా ఇవ్వకండా పెద్ద మనుషుల తీర్మానాన్ని నిరాకరించిందని కక్ష పెంచుకున్న అశోక్ తన వదిన (నర్సింహ భార్య)బొంత వెంకటలక్ష్మిని హత్య చేసేందుకు పథకంవేశాడు. వెంకటలక్ష్మి పొలానికి యూరియా చల్లించి ఇంటికి వస్తున్న క్రమంలో అశోక్ మరికొందరి సాయంతో కొడవలితో ఆమెపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమైన వెంకటలక్ష్మి అరుస్తూ కింద పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులు, 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను భువనగిరికి ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టారు.