IND vs PAK : క్రికెట్ అభిమానులకు కావాల్సినంత థ్రిల్‌ను పంచే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. అంతర్జాతీయ వేదికపై ‘నువ్వానేనా’ అని తలపడే ఇండో-పాక్ జట్ల పోరుపై ఈసారి సందేహాలు నెలకొన్నాయి. ఐసీసీ నిర్వహించే వరల్డ్‌కప్ నుంచి ఆసియా కప్ వరకూ ఒకే గ్రూప్‌లో ఉండే దాయాదులు.. ఆసియా క్రీడల్లో (Asian Games 2026) మాత్రం వేర్వేరు గ్రూప్‌లో నిలిచాయి. త్వరలో జపాన్ వేదికగా జరుగనున్న ఈ గేమ్స్‌లో ఇరుజట్లు ప్రత్యర్థులుగా తలపడే అవకాశాలు తక్కువే. దాంతో, ఎప్పటిలా చిరకాల ప్రత్యర్థుల ఆటను చూసే భాగ్యం ఈసారి దక్కేలా కనిపించడం లేదు.
ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ వంటి టోర్నీల్లో కనీసం రెండుసార్లైనా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసేవాళ్లం. అయితే.. ఈసారి మాత్రం అభిమానులకు నిరాశే ఎదురవ్వనుంది. ఎందుకంటే.. ఆసియా క్రీడల్లో దాయాదులు వేర్వేరు గ్రూప్‌లో ఉండడమే అందుకు కారణం. గురువారం తీసిన డ్రాలో.. చిరకాల ప్రత్యర్థులు చెరో గ్రూప్‌లో నిలిచాయి. పురుషుల, మహిళల విభాగంలోనూ ఇదే పరిస్థితి. దాంతో, ఇంతకుముందులా ఒకే టోర్నీలో మరోమారు బిగ్‌ఫైట్‌ను వీక్షించడం సాధ్యం కాదు.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. భారత్, పాకిస్థాన్ జట్లు వ్యతిరేక గ్రూప్‌లో ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్ 1లో పాక్, క్వార్టర్ ఫైనల్ 2లో టీమిండియా తలపడనున్నాయి. క్వార్టర్ ఫైనల్ 1లో గెలుపొందిన జట్టు సెమీఫైనల్లో.. క్వార్టర్ ఫైనల్ 3 విజతేను ఢీకొడుతుంది. అలానే.. క్వార్టర్ ఫైనల్ 2 విజేత, క్వార్టర్ ఫైనల్ 4లో గెలుపొందిన జట్టు రెండో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ ఫైనల్ చేరితో పసిడి పతకం కోసం.. అదీ కాదంటే కాంస్యం కోసం మాత్రమే తలపడే అవకాశముంది. చివరిసారిగా 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు గ్రూప్ ఏ, గ్రూప్ బీలో ఆడాయి.
ఆసియా క్రీడల్లో క్రికెట మ్యాచ్‌లు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు జరుగనున్నాయి. పురుషుల జట్ల మ్యాచ్‌లు సెప్టెంబర్ 24వ తేదీన మొదలై అక్టోబర్ 1వ తేదీన పూర్తవుతాయి. కానీ, మహిళల జట్ల మ్యాచ్‌లు మాత్రం ఆరు రోజుల్లోనే ముగియనున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 22 వరకూ మహిళల ఛాంపియన్ ఎవరో తేలియనుంది.