మాసాచుసెట్స్: అమెరికాలో 17 ఏళ్ల భారతీయ సంతతి వ్యక్తి(Indian Origin Teen) .. తన తల్లి, సోదరుడిని హత్య చేశాడు. ఈ ఘటన మసాచుసెట్స్ శివారు ప్రాంతంలో జరిగింది. నిందితుడిని అర్జున్ అరవింద్‌గా గుర్తించారు. అతనిపై పలు నేరాభియోగాలు నమోదు చేశారు. 14 ఏళ్ల సోదరుడు సిద్దార్ధ అరవింద్, 45 ఏళ్ల సుధా వెంకటేశన్ హత్యకు గురయ్యారు. ఇంట్లోని ఇద్దర్నీ చంపేసి.. అర్జున్ తన తల్లి కారుతో పరారీ అయ్యాడు. ఏ ఆయుధంతో అతను తన ఫ్యామిలీని చంపేశాడన్న విషయాన్ని ఇంకా మెడికల్ ఆఫీసర్లు ద్రువీకరించలేదు. ఆక్టాన్లో ఉన్న మార్దా లేన్ ఇంటిలో ఈ మర్డర్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
బోస్టన్‌కు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉన్నది. ఆగస్టు 11వ తేదీన ఆక్టన్ పోలీసులకు అర్జున్ తండ్రి నుంచి ఫోన్ వెళ్లింది. ఇంట్లో ఉన్న కుటుంబీకులు రెస్పాండ్ కావడం లేదని అతను ఫిర్యాదు చేశాడు. వారి ఇంటికి ఓ ట్యూటర్ వెళ్లగా, ఇంట్లో ఎవరూ కాంటాక్టు కాలేదు. దీంతో ఆ ట్యూటర్ అర్జున్ తండ్రికి ఫోన్ చేశాడు. అయితే నిందితుడి తండ్రి ఇంటికి ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఫోన్‌కు స్పందించకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సిద్ధార్ద్ అనే వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్లో, సుధా అనే వ్యక్తి బేస్మింట్‌లో శవాలై కనిపించారు. హత్యకు పాల్పడిన అర్జున్ తన తల్లి కారుతో పరారీ అయినట్లు గుర్తించారు. వేలాండ్లోని ఓ పార్కింగ్ ప్రదేశంలో అర్జున్ కారులో ఉన్నట్లు పోలీసులు పసికట్టారు. అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల అర్జున్ ప్రవర్తన సరిగా లేదని గుర్తించారు. ఇంటర్నెట్, చాట్‌జీపీటీలో ఫ్యామిలీ హత్యకు చెందిన అంశాలను అతను సెర్చ్ చేసినట్లు తెలిసింది.