Jharkhand | రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) ఉద్యోగ నియామక ప్రక్రియలో జరిగిన కుంభకోణంపై విద్యార్థులు కొన్ని వారాలుగా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 20 మందిని ఆ రాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) అరెస్ట్ చేసింది. వారిలో పరీక్షల నిర్వహణ ఏజెన్సీ అయిన టీడీపీఎల్ (TDPL) మార్కెటింగ్ మేనేజర్ అభయ్ తివారీ ఒకరు. ఆయన ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలపై పోలీసులకు వెల్లడించారు.
ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా..
తాము అడిగిన డబ్బులు చెల్లించినవారికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రణాళిక చేపట్టాం. దీనిలో టీడీపీఎల్ డైరెక్టర్ రామ్‌వీర్ సింగ్, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఎల్ ఖియాంగ్టే, జేపీఎస్సీ సభ్యులు అజితా భట్యాచార్య, డాక్టర్ జమాల్ అహ్మద్, డాక్టర్ అనిమా హన్స్దా భాగస్వాములుగా ఉన్నారు. ఏజెంట్లు, మధ్యవర్తులు అభ్యర్థులను ఖరారు చేసేవారు. వారిని ఒక ఏజెంట్ ఆదిత్య పాండే టీడీపీఎల్ రామ్‌వీర్ సింగ్‌కు పరిచయం చేశారు. ఆయన వారిని కమిషన్ సభ్యుల వద్దకు పంపి ఇంటర్వ్యూ బోర్డును ఫిక్స్ చేసుకుని ఫైనల్ మార్కులు పెరిగేలా ప్రణాళిక రచించాం అని అభయ్ వెల్లడించారు.
లెవల్స్‌ను బట్టి..
జేపీఎస్సీ నిర్వహించిన 12, 13 పరీక్షల్లోని లెవల్స్‌ను బట్టి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 15 లక్షల వరకు తీసుకున్నాం. అలా ఇంటర్వ్యూ వరకు సుమారు రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు వసూలు చేశాం అని తెలిపారు. ఈ స్కామ్ ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన ముగ్గురి పేర్లను వెల్లడించారు. వారు.. పోలీస్ సూపరింటెండెంట్ రాబిన్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ సింగ్, డిప్యూటీ జైలర్ రాజేశ్ కుమార్ రజక్. వీరిని లాలూ యాదవ్ అనే ఏజెంట్ తీసుకురాగా, వారిని రామ్‌వీర్ సింగ్, అజితా భట్టాచార్య బోర్డుతో ఇంటర్వ్యూ ఫిక్స్ చేశారని పేర్కొన్నారు. దీనిలో ఎగ్జామ్ కంట్రోలర్ శ్వేతా గుప్తా, పతంజలి కోచింగ్ సెంటర్ ఆపరేటర్ రవికుమార్ పాలుపంచుకున్నారని తెలిపారు.
వివిధ వ్యక్తుల ద్వారా..
డబ్బులను వివిధ వ్యక్తుల చేరవేసేవారు. అజితా భట్టాచార్యకు పంపాల్సినవి ఆమె పీఏ బ్రిజ్రామ్కు ఇచ్చారు. ఖియాంగ్టేకు ఇవ్వాల్సినవి ధర్మేంద్ర అనే వ్యక్తి ద్వారా ఇచ్చేవారు అని పేర్కొన్నారు. అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) పరీక్షలో కూడా స్కామ్ చేశామని, ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల చొప్పున వసూలు చేశామని వెల్లడించారు. కాజల్ భారతి అనే అభ్యర్థి నుంచి రూ. 10 లక్షలు తీసుకుని అజితా భట్టాచార్య బోర్డు ఇంటర్వ్యూను ఫిక్స్ చేశామని అభయ్ పోలీసులకు వివరించారు. పోలీసులు ఇప్పటికే జేపీఎస్సీ మాజీ చైర్మన్ ఖియాంగ్టేను అరెస్ట్ చేశారు. అజితా భట్టాచార్య, డాక్టర్ జమాల్ అహ్మద్, డాక్టర్ అమిమా హన్స్దా కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరికి సీఐడీ సమన్లు జారీ చేసి, మాజీ చైర్మన్‌కు సంబంధించిన అంశాలపై విచారించింది.