Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) గురువారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఈ రోజు లోక్‌సభ (Lok Sabha) ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం (Vandematharam) లోని ఆరు చరణాలను ఆలపించారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తోపాటు సభ్యులంతా హాజరయ్యారు. ఆరు చరణాలను పూర్తిగా ఆలపించిన అనంతరం సభను నిరవధికంగా వాయిదావేశారు. దాంతో వర్షాకాల సమావేశాలు ముగిసినట్లు అయ్యింది.
వందేమాతరానికి చట్టపరంగా రక్షణ కల్పించే శాసనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలే ఆమోద ముద్రవేశారు. కొన్ని రోజులకే లోక్‌సభలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వందేమాతరం ఆలపించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా నిరోధించడం శిక్షార్హమైన నేరమని ఈ చట్టం స్పష్టంచేస్తోంది. తద్వారా దీనికి జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన హోదా లభించినట్లు అయింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకావిష్కరణ, గవర్నర్ల ప్రసంగం వంటి సందర్భాల్లో వందేమాతరంలోని ఆరు చరణాలను ఆలపించాలని జనవరి 28న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13వ తేదీతో ముగిశాయి. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనబాట పట్టింది. జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ రోజు చలో పార్లమెంట్ యాత్రకు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ యాత్రకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అలాగే భారీగా పోలీసులను మోహరించారు. ఈ యాత్రలో భారీగా యువత పాల్గొన్నారు.
వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దాంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో కేంద్రమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అదేవిధంగా పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్లుతోపాటు పలు బిల్లులు ఆమోదం పొందాయి. అయితే ఢిల్లీలో యువతపై జరిగిన లాఠీ ఛార్జ్‌కు ఎవరు ఆదేశాలు ఇచ్చారో సభలో ప్రకటన చేయాలంటూ కేంద్రాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సభలో దాదాపుగా వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు ఈ రోజు ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.