ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఫలహారంగా మారుతున్నాయి. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి, భూములను రైతులకు తిరిగి వెనక్కి ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరిగి ఇవ్వకపోగా రైతులకు ఇంటి స్థలాలు కేటాయించిన లేఅవుట్పై కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలిపోయారు. ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధించడమేకాకుండా, ఇప్పుడు రైతులను భయపెట్టి అడ్డికి పావుసేరుకు స్థలాలను కొల్లగొడుతున్నారు. బహిరంగ మార్కెట్లో చదరపు గజం రూ.30 వేల వరకు ఉండగా, రూ.4-5 వేలకే కొనుగోలు చేసి రైతుల్ని నట్టేట ముంచుతున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో సుమారు 19,400 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి, భూసేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. 14 వేలకుపైగా ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. పరిహారంగా పట్టా భూమికి రూ.16.5 లక్షలు, అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.8.5 లక్షల వరకు నగదు చెల్లించింది. దీంతోపాటు భూమిని కోల్పోయిన వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 1400 ఎకరాల 2వ పేజీలో
భూమిని కేటాయించింది. ఇందులో దాదాపు 560 ఎకరాల్లో నివాస స్థలాల కోసం భారీ లేఅవుట్‌ను రూపొందించింది. రైతులు ఇచ్చిన ఎకరా భూమికి బదులుగా అభివృద్ధి చేసిన 121 చదరపు గజాల ఇంటి స్థలాన్ని పరిహారంగా అందజేసింది. విశాలమైన రహదారులు, ఖాళీ స్థలాలు, ఇలా అన్నిరకాల మౌలిక వసతులు కల్పించడంతో రైతులు సంతోషపడ్డారు. పట్టాల పంపిణీని పండుగలా చేసుకున్నారు. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు చెందిన దాదాపు 5,720 మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ప్లాట్లను కేటాయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వారికి స్థలాలను అప్పగించే ప్రక్రియ (పొజిషన్ ఇవ్వడం) వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం రైతుల దగ్గర ప్లాట్ల నెంబర్లు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టా మాత్రమే ఉన్నది. అధికారులు పొజిషన్ ఇస్తే ఆయా రైతులకు ప్లాట్ నెంబర్లు వస్తాయి. అనంతరం సబ్‌రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ చేస్తారు.
ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరు కక్షసాధింపు చర్యగా మారింది. భూములు తిరిగి ఇవ్వకపోగా, వారికి హక్కుగా రావాల్సిన ఇంటి స్థలాలను ఏడాదిన్నరగా ఇవ్వడం లేదు. మీర్ఖాన్పేటలోని లేఅవుట్లో రైతులకు పొజీషన్ ఇస్తామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఈ ఏడాది జనవరిలోనే అధికారికంగా ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. పైగా రోజురోజుకీ ఆ లేఅవుట్‌ను నామరూపాల్లేకుండా చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఆ లేఅవుట్లో నుంచే 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి అలైన్‌మెంట్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. అంటే ఒకవైపు తమ భూముల్ని కోల్పోయి, మరోవైపు ప్రభుత్వం పరిహారంగా ఇచ్చిన ప్లాటును సైతం ప్రభుత్వం దక్కకుండా చేయడం రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. దీంతో గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం ఎక్కడ, ఎవరి ప్లాటు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం అన్ని ప్లాట్లను రైతులకు అప్పగించకుండా ఆ ప్రక్రియను అటకెక్కించింది.
వాస్తవానికి పరిహారంగా రైతులకు పంపిణీ చేసిన ఇంటి స్థలాలను అమ్ముకోవచ్చా? లేదా? అనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి నిబంధన విధించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాత్రం వారు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చనే వెసులుబాటును ఉంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొదట రైతులకు ప్లాట్లపై పొజిషన్ ఇస్తే రిజిస్ట్రేషన్ పూర్తయి తర్వాత క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం మీర్ఖాన్పేట్ పరిధిలో చదరపు గజం 30-35వేల వరకు ధర పలుకుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఫోర్త్‌సిటీ ఈ ప్రాంతం కేంద్రంగానే ఉండటంతో భవిష్యత్తులో ధర ఇంకా పెరిగే అవకాశముందని రియల్ వ్యాపారులు చెప్తున్నారు. కానీ ఆ మేరకు ఫలాలు రైతులకు అందకుండా కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలుతున్నారు. లేఅవుట్లో నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వెళుతున్నందున ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వదంటూ అధికార పార్టీ నేతలు రైతుల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు.
ఎప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆ పట్టానే మిగులుతుంది తప్ప మీకు ప్లాట్లు దక్కవంటూ వారిలో భయాందోళలు రేపుతున్నారు. తద్వారా రైతుల నుంచి అడ్డికి పావుసేరులా అనధికారికంగా ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో దళారులు కూడా రంగంలోకి దిగి రైతుల్ని మరింత భయపెడుతున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కాబట్టి, వచ్చిందే చాలు! అన్నట్లుగా రైతులు రూ.4-5వేలకే తమ ప్లాట్లను అమ్మకుంటున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ఒక బడా నేత పదుల సంఖ్యలో తక్కువ ధరకు రైతుల నుంచి ప్లాట్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. యాచారం మండలంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భారీ ఎత్తున రైతుల నుంచి రూ.4-5 లక్షలకే కొనుగోలు చేసినట్లు తెలిసింది.
రైతులు భవిష్యత్తులో ఎదురు తిరగకుండా ఖాళీ స్టాంపు పేపర్లపై వేలిముద్రలు తీసుకుంటున్నారట. కొందరు కాంగ్రెస్ నేతలు నగర శివారులోని బిల్డర్లు, మేస్త్రీలకు ఈ ప్లాట్లను అమ్మి రూ.లక్షలు దండుకుంటున్నట్టు సమాచారం. ఇలా అధికార పార్టీ నేతలు ఇప్పటివరకు 500-600 ప్లాట్లను తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన చోటా మోటా నేతలు దళారుల అవతారమెత్తడంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొజీషన్ ఇవ్వడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తాము అధికారంలోకి రాగానే భూముల్ని తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ప్లేటు ఫిరాయించారు. వాస్తవానికి భూసేకరణ సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఫార్మాసిటీని రద్దుచేస్తే వాళ్ల భూములు తిరిగి ఇవ్వాలనే షరతు ఉన్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దుచేసినా, హైకోర్టులో మాత్రం కొనసాగిస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ భూములను ఇతర అవసరాలకు కేటాయించినట్టు అధికారిక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. చివరకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బహిరంగంగానే ఫార్మాసిటీ రద్దయిందని, అది ఒడిసిపోయిన ముచ్చటని ప్రకటించారు. అయినా రైతుల భూముల్ని మాత్రం తిరిగి ఇవ్వబోమని ప్రకటించి, ఎన్నికల హామీని తుంగలో తొక్కినట్టు అంగీకరించారు. ఇంకా సేకరించని భూములను నిషేధిత జాబితాలోనే ఉంచి ప్రభుత్వం వారినీ ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరకాలంగా రైతులను అరిగోస పెడుతున్నది.