భోపాల్, జూలై 1: దేశంలోని రహదారుల వ్యవస్థను నిర్వహించే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తాజాగా ఓ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టులో చేసిన నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని నివ్వెరపోయేలా చేశాయి. ‘ఏ పనీ లేనప్పటికీ ప్రజలు ఎందుకు తెల్లారక ముందే ఇళ్లలోనుంచి రోడ్లపైకి వస్తున్నారు?’ అని గత వారం ఇండోర్-దివాస్ హైవేపై ముగ్గురి మరణానికి దారితీసిన 40 గంటల ట్రాఫిక్ జామ్‌పై ఎన్హెచ్ఏఐ తరఫు న్యాయవాది స్పందించారు.
ఓపెన్ కోర్టులో అత్యంత నిర్లక్ష్యంగా న్యాయవాది వేసిన ప్రశ్న ట్రాఫిక్ జామ్‌లో తమ ఆప్తులను కోల్పోయి న్యాయం కోసం వచ్చిన బాధిత కుటుంబాలను ఆగ్రహానికి గురిచేసింది. గత శుక్రవారం 8 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ స్తంభించిపోయి 4 వేలకు పైగా వాహనాలు చిక్కుకుపోయి ముగ్గురు వ్యక్తులు అస్వస్థతతో కన్నుమూశారు.
అదే ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయిన దేవస్కు చెందిన న్యాయవాది ఆనంద్ అధికారి మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. డైవర్షన్ రోడ్డును నాలుగు నెలల్లో పూర్తి చేయాలని గత సెప్టెంబర్‌లో ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ఎన్హెచ్ఏఐని కోర్టు ప్రశ్నించగా, క్రషర్ యూనిట్లు సమ్మె కారణంగా జాప్యం జరిగిందని సంస్థ జవాబిచ్చింది.
ఏ పనీ లేనప్పటికీ ప్రజలు ఎందుకు తెల్లారక ముందే ఇళ్లలోనుంచి రోడ్లపైకి వస్తున్నారు? అని ఎన్హెచ్ఏఐ న్యాయవాది పట్వర్ధన్ వేసిన ప్రశ్నపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం అలాంటి వ్యాఖ్యలు సరైన కారణం అనిపించుకోవని, ఇక సామాన్య ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావడం సురక్షితం కాదని భావించవలసి వస్తుందని పేర్కొంది. లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన కోర్టు కేసు తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది.