చెన్నై, జూలై 1: తమిళనాడులోని ఓ ఆలయ సెక్యూరిటీ గార్డ్ పోలీసుల అదుపులో ఉండగా మృతిచెందిన కేసులో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వమే తమ పౌరుణ్ని చంపిందని జస్టిస్ సుబ్రమణియన్ మండిపడ్డారు. మృతుడి శరీరంపై అన్ని అవయవాలపై మొత్తం 44 గాయాలయ్యాయంటే పోలీసులు ఎంత క్రూరంగా ప్రవర్తించారో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. అజిత్‌కుమార్(27) ఓ ఆలయంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసేవాడు. ఆలయంలో నగల చోరీ కేసులో అతడిని జూన్ 27న అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అతడు చనిపోయాడు.
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు అధికార మత్తులో మునిగిపోయినట్టు కనిపిస్తున్నదని, మృతుడి మలద్వారం, నోరు, ముక్కులో కారంపొడి పోసినట్టు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలిందని చెప్పారు. పోలీసులు సాధారణ హంతకుల కంటే దారుణంగా ప్రవర్తించారని తీవ్రంగా మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కావడానికి వీల్లేదని కోర్టు హెచ్చరించింది.
కేసును మదురై బెంచ్‌కు చెందిన రిటైర్డ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. కేసుపై సీబీఐ విచారణను కూడా ప్రభుత్వం పరిశీలించాలని సూచించగా, పారదర్శక విచారణనే తాము కోరుకుంటున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలు ఈ కేసును రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. ఇందుకు స్పందించిన జడ్జి.. మీరు ప్రతిపక్షంలో ఉన్నా ఇలాగే చేసేవారు అని చురకలు అంటించారు.జూలై 8న దర్యాప్తు నివేదికను అందజేయాలని స్పష్టంచేశారు. కోర్టు సూచన నేపథ్యంలో ఈ కేసును సీఎం స్టాలిన్ సీబీఐకి అప్పగించారు.