Vinesh Phogat | హర్యానాకు చెందిన మహిళా రెజ్లర్, జింద్ ఎమ్మల్యే వినేష్ ఫోగట్-సోమవీర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చిలో వినేశ్ దంపతులు ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తమ ప్రేమ కొత్త అధ్యాయంతో కొనసాగుతుందంటూ భర్త సోమ్‌వీర్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. జులానా ప్రాంతంలోని బక్తఖేడ గ్రామ నివాసి సోమ్‌వీర్, వినేశ్ రైల్వేలో పని చేస్తున్న సమయంలో కలుసుకున్నారు.
మొదట్లో ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోకపోయినా.. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులయ్యారు. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో వినేష్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆ సమయంలో దేశానికి వచ్చిన సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే వినేశ్‌కు ప్రపోజ్ చేసి చేతి వేలికి ఉంగరం తొడిగాడు. అదే ఏడాది డిసెంబర్ 14న పెళ్లి చేసుకున్నారు. సోమ్‌వీర్ సైతం రెజ్లర్ కావడం విశేషం. రెండుసార్లు నేషనల్ చాంపియన్‌గా నిలిచాడు. వినేశ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.