Khammam Floods | ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ గుండాలు అడ్డుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. మంచికంటి నగర్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ గుండాల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆందోళనకారులను పోలీసులు నిలువరించకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల అరాచకాలపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. మీరు సహాయం చేయలేదు.. కానీ సహాయం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై దాడులు సరికాదని స్థానికులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల గుండాయిజంపై మంచికంటి నగర్ వాసులు నిప్పులు చెరిగారు. కనీసం ఇప్పటి వరకు తాము తిండి తినలేదని, నిత్యావసరాలు ఇచ్చేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడి.. మా నోటికాడి బుక్కను లాగేసుకుంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలపై మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమను ఆదుకున్న వారిని అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలకు పాపం పండుతుందని స్థానికులు శాపనార్థాలు పెట్టారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఖమ్మం వరద బాధితుల బాధలు విని.. తీవ్ర భావోద్వేగానికి లోనైన హరీశ్‌రావు
Harish Rao | ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి హరీశ్‌రావు.. వీడియో