Harish Shankar | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటున్న ఆయన, తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా గురించి మాట్లాడిన హరీష్ శంకర్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ కల్యాణ్ అభిమానులకు నిజమైన మాస్ జాతరలా ఉంటుందని తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మరోసారి పవన్‌ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపిస్తున్నామని, డైలాగులు మరియు యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయించేలా ఉంటాయని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, హరీష్ వ్యాఖ్యలు సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి.
ఇక సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తనకు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడినట్లు హరీష్ శంకర్ వెల్లడించారు. ట్రైలర్‌లోని ప్రతి షాట్ గురించి చిరంజీవి ఎంతో ఆసక్తిగా మాట్లాడారని చెప్పారు. పవన్ కల్యాణ్ చాలా అందంగా కనిపిస్తున్నాడని, డైలాగులు కూడా అద్భుతంగా ఉన్నాయని చిరంజీవి ప్రశంసించారని తెలిపారు. ఆ సంభాషణ తర్వాత తనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైందని హరీష్ అన్నారు. చిరంజీవి గారికి పవన్ కల్యాణ్ కేవలం తమ్ముడు మాత్రమే కాదు.. ఒక కొడుకు లాంటివాడు అని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో మరింత చర్చకు దారితీస్తున్నాయి.
తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా హరీష్ శంకర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం తన చిరకాల కోరిక అని తెలిపారు. త్వరలోనే చిరంజీవితో ఒక ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు వెల్లడించారు. చిరంజీవి గారితో నేను సినిమా చేస్తే అది ఖచ్చితంగా ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్ లీడర్’, ‘దొంగ మొగుడు’ తరహాలో వింటేజ్ మాస్ స్టైల్లో ఉంటుంది. అలాంటి స్థాయి సినిమా ఆయనకు ఇవ్వడమే నా లక్ష్యం అని హరీష్ శంకర్ చెప్పారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు హరీష్ శంకర్ కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు అధికారికంగా పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు