– కొలిక్కిరాని పరిహారం చెల్లింపు
కారేపల్లి, మార్చి 17 : డోర్నకల్- భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం భూ సేకరణ చేసిన భూములకు రేటు విషయంలో చర్చించేందుకు ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి సింగరేణి గ్రామానికి చెందిన భూ నిర్వాసితులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాసితులు కోరిన రేటును నిర్ణయించేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో చర్చలు కొలిక్కి రాలేదు. వ్యవసాయ భూమికి ఎకరానికి రూ.91 లక్షల చొప్పున, ఇళ్ల స్థలాలకు గజానికి రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని బాధితులు అధికారులను కోరారు. ఆ రేటు సాధ్యపడధని అధికారులు తేల్చివేస్తూ వ్యవసాయ భూమికి ఎకరానికి రూ.18 లక్షలు, ఇళ్ల స్థలాలకు గజానికి రూ.6,300 చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిర్మించిన ఇళ్ల విషయంలో మున్నీర్ అనే బాధితుడి ఇంటికి ఆర్ అండ్ బి అధికారుల ఎస్టిమేషన్ అదనంగా కల్పించే పరిహారంతో రూ.46 లక్షలు వస్తాయని ఉదాహరిస్తూ అధికారులు ప్రకటించారు.
ఏజెన్సీ ప్రాంతాల భూసేకరణలో చెల్లించిన రేట్లనే చెల్లిస్తామని అధికారులు పేర్కొనడంతో దానికి నిర్వాసితులు అంగీకరించలేదు. నాన్ ఏజెన్సీ విషయంలో అక్కడి భూముల ధరలను కూడా పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని బాధితులు కోరారు. మరోసారి ఏర్పాటు చేసే సమావేశం నాటికి ఆలోచించుకుని నిర్ణయం తెలపాలని అధికారులు పేర్కొన్నారు. రైతులు, ఇళ్లు కోల్పోయిన వారు కోరిన విధంగా పరిహారాన్ని చెల్లించి న్యాయం చేయాలని కోరుతూ సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాప్ ఆధ్వర్యంలో జేసీ శ్రీనివాసరెడ్డికి నిర్వాసితులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సమావేశంలో సింగరేణి తాసీల్దార్ రమేశ్, రైల్వే జేఈ శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జగదీశ్, జీపీఓ బంపర్ పాల్గొన్నారు.