శనివారం 11 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 00:45:57

ప్రకృతి ‘మార్గాలు’

ప్రకృతి ‘మార్గాలు’

  • రోడ్డుకిరువైపులా రంగురంగుల మొక్కలు నాటాలి
  • హైవేలపై నర్సరీలు పెంచటానికి స్థలాలు గుర్తించండి
  • అధికారులకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశం

వేల్పూర్‌ : చూపరులను ఆకట్టుకునేలా పచ్చనిచెట్లతో రహదారులను ఆహ్లాదకరంగా మార్చాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఆ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమంపై మంత్రి సమీక్షించారు. రోడ్డుకిరువైపులా రంగురంగుల మొక్కలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. 

హరితహారంలో భాగంగా ఆర్‌అండ్‌బీ శాఖ పెద్దఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారులపై నర్సరీలు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిధిలోని 800 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారులకు ఇరువైపులా ఈసారి 3.30 లక్షల మొక్కలు నాటి, సంరక్షించేందుకు బాధ్యత తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ రీజినల్‌ అధికారి కృష్ణప్రసాద్‌కు సూచించారు. 

రాష్ట్రపరిధిలోని 300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులపై రోడ్లకు ఇరువైపులా 50 వేలు, 25 కలెక్టరేట్లలో వెయ్యి చొప్పున మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి మంత్రికి చెప్పారు. ఆర్‌అండ్‌బీ శాఖ రాష్ట్రపరిధిలోని 2,458 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా 9.97 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈఎన్సీ రవీందర్‌రావు తెలిపారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.


logo