CM Revanth Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టతకు సరికొత్త విధానంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ కారదర్శి బుర్రా వెంకటేశంకు ముఖ్యమంత్రి సూచించారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు సీఎం. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు.
అంగన్వాడీలలో విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్‌ను నియమించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని ఆదేశించారు.
విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ నిధులతోపాటు సీఎస్ఆర్ ఫండ్స్‌తో విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
Telangana | ఆర్థిక శాఖలో పని విభజన.. స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు పని భారం తగ్గింపు..!
Group-2 | నిరుద్యోగులకు తలవంచిన రేవంత్ సర్కార్.. గ్రూప్-2 డిసెంబర్‌కు వాయిదా
KTR | చారాణ కోడికి.. బారాణ మసాలా..! కాంగ్రెస్ రుణమాఫీపై కేటీఆర్ సెటైర్లు