Mokshagna | నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రం ‘ఆదిత్య 369’కు కొనసాగింపుగా రూపొందనున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ ద్వారా హీరోగా పరిచయం కానున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. 1991లో విడుదలైన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. మార్చి నెలలో అధికారికంగా చిత్రాన్ని ప్రారంభించాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బలమైన నటీనటులను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మోక్షజ్ఞ లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఆయనను స్టైలిష్, మాడర్న్ అవతార్‌లో ప్రేక్షకులకు పరిచయం చేయాలని యూనిట్ భావిస్తోంది.
ఇటీవల తన కుమారుడి ఎంట్రీపై స్పందించిన నందమూరి బాలకృష్ణ, “మోక్షజ్ఞను ఎలా పరిచయం చేయాలో నాకు తెలుసు. అతని కోసం ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్‌లో రెడీగా ఉన్నాయి” అంటూ ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ ఎంట్రీ ప్రత్యేకంగా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు రాస్తున్నారు. ఆయన పదునైన డైలాగులు, భావోద్వేగాన్ని కలగలిపే రచన ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూర్చనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.మొత్తానికి, నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రం ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో టాలీవుడ్లో కొత్త చాప్టర్ ప్రారంభమవుతున్నట్టే. ఈ భారీ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందో చూడాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.