KTR | హైదరాబాద్ : బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమవాస్యకు బాంబులు కొంటే కార్తీక పౌర్ణమి నాటికి కూడా పేలుతలేవు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. ఆయన తుస్సు బాంబుల శాఖ మంత్రి అని కేటీఆర్ విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు జరిగి 45 రోజులు అయ్యింది. ఈడీ కానీ బీజేపీ వాళ్లు కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రకటన చేయటం లేదు. ప్రజలు ఆగం కావద్దు. ఎవరు ఎవరితో ఉన్నారో అర్థం చేసుకోవాలి. మాకు పదవులు, కొట్లాట, కేసులు కొత్తకాదు. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డితో మాకు గట్టు పంచాయితీ ఏమీ లేదు. కొడంగల్‌లో గిరిజనుల భూమి గుంజుకోవటంపై ప్రశ్నిస్తే ఆయనకు కోపం వస్తోంది. మూసీ కుంభకోణం గురించి ప్రశ్నిస్తే కోపం వస్తోంది. అర్హత లేని బావమరిది కంపెనీకి అమృత్ టెండర్లు కట్టబెట్టటంపై కోపం వస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ గురించి అడిగితే సీఎంకు కోపం వస్తోంది అని కేటీఆర్ తెలిపారు.
ఏదో కేసులు పెట్టి జైల్లో పెడితే ప్రశ్నించటం మానేస్తామని వాళ్లు అనుకుంటున్నారు. నేను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్, కేటీఆర్‌లు పుట్టుకొస్తారు. ఇప్పడే పోరాటం మొదలైంది. మరో నాలుగేళ్లు ఈ కాంగ్రెస్‌తో పోరాటం చేయాల్సి ఉంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారాడో ప్రజలు అడగాలి. అభివృద్ధి కోసం పోయిన అంటే కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండో చెప్పామనాలి అని ప్రజలకు కేటీఆర్ సూచించారు.
ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్లు మేకలను కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చెబుతున్నారు. ఖర్గేను తెలంగాణ రమ్మని చెబుతున్నా. ఇక్కడ మా మేకలు మీ మందలో తప్పిపోయాయి చూడాలని కోరుతున్నా. ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలకు సిగ్గుందా? ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ముందా? కేసీఆర్ ఆధ్వర్యంలో నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. రాజేంద్రనగర్‌లో ఉప ఎన్నిక రావటం ఖాయం. ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయం. రాజేంద్రనగర్‌ను భవిష్యత్‌లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు కార్తీక్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | గాడ్సే శిష్యుడు రేవంత్ గాంధీ విగ్రహం పెడుతాడంట.. మండిపడ్డ కేటీఆర్
KTR | మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
KTR | దేవుళ్లనే మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే.. కేటీఆర్ సెటైర్లు