Sharwanand | టాలీవుడ్లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోలలో ఒకరిగా గుర్తింపు పొందిన శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘బైకర్’, ‘భోగి’ వంటి ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో శర్వానంద్ మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కామెడీ, కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వైట్లతో ఆయన కొత్త సినిమా చేయనున్నట్లు సమాచారం.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల శ్రీను వైట్ల చెప్పిన కథ శర్వానంద్‌కు బాగా నచ్చిందట. దీంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా శ్రీను వైట్ల స్టైల్లోనే ఫుల్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన ఒక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ‘జార్జ్ కృష్ణ’. శ్రీను వైట్ల సినిమాల్లో క్యారెక్టర్ పేర్లు, టైటిల్స్ చాలా క్యాచీగా ఉండే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఇదే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఒకవైపు మాస్ ఎలిమెంట్స్, మరోవైపు ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రాక్ ఉండనుందని సమాచారం. శర్వానంద్ టైమింగ్‌కు శ్రీను వైట్ల మార్క్ కామెడీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం శర్వానంద్ తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అవి పూర్తయ్యాక ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మేకర్స్ కూడా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇక దర్శకుడు శ్రీను వైట్ల కూడా ఒక బలమైన కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ ‘జార్జ్ కృష్ణ’ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. శర్వానంద్ తన కెరీర్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో, ఈ కొత్త పాత్రలో ఆయన ఎలా మెప్పిస్తారో చూడాలి.