Assembly Budget Session | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్నారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన గవర్నర్.. శ్రమించే తత్వం గల శాంతికాముక తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశాల్లో ఆరు గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. అయితే, సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీ సమావేశాలను ముగించాలన్న ఆలోచనతో అధికార పక్షం కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తున్నది. గరిష్ఠంగా 10 పని దినాల్లోనే సభను ముగించాలని అధికార పక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులోనే గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం, రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం, ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించడం తదితర అంశాలను పూర్తిచేయాల్సి ఉంటుంది.
ఈ నెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి, 29 లేదా 30వ తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేయించి, సభను వాయిదా వేసే విధంగా వ్యూహరచన చేసినట్టు తెలిసింది. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా జాప్యం, సింగరేణి బొగ్గు గనుల అవినీతి, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తుది తీర్పు, మూసీ కూల్చివేతలు తదితర అంశాలపై సభలో బీఆర్ఎస్ నిలదీసే అవకాశం ఉన్నదని, ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో బీఆర్ఎస్ సభ్యులు సభలోకి వచ్చే అవకాశం ఉన్నదని ప్రభుత్వానికి ఉప్పందటంతో ముఖ్యమంత్రి, మంత్రివర్గం అప్రమత్తమైనట్టు తెలిసింది. మార్చి 30 వరకు సభను ముగించాలని నిర్ణయించినట్టు సమాచారం.