KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తాడని ఎవరు అనుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్ చెప్పి పచ్చి అబద్దాలను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఎండగట్టి ఉతికి ఆరేశారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నట్టు మీరు విడుదల చేసిన నివేదికనే చెబుతుంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏదాడిలో నువ్వు ఏం చేశావంటే.. రేవంత్‌కు చెప్పేందుకు మ్యాటర్ లేదు. మేం(బీఆర్ఎస్) దిగిపోయేనాడు ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 89 లక్షల 97 వేలు అని భట్టి విక్రమార్కనే చెప్పిండు. మరి కొత్తగా ఏమన్న ఇచ్చారంటే.. లక్ష కార్డులు తొలగించామని చెప్పారు. కొత్తవి ఇవ్వకుండా ఉన్నవి కట్ చేసిండ్రు అని కేటీఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తడు అని అనుకోరు. సీఎం చెప్పిన పచ్చి అబద్దాలను డిప్యూటీ సీఎం ఎండగట్టి ఉతికి ఆరేశారు. అప్పులకు మిత్తీలకు నెలకు రూ. 6500 కోట్లు కడుతున్నాం అని రేవంత్ రెడ్డి చెప్పిండు. నేను చెప్పింది తప్పయితే ఏ శిక్షకైనా సిద్ధం. మిత్తీలకు పోయిన పది నెలలకు 22 వేల 56 కోట్లు కట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు. నెలవారీ లెక్క కూడా ఇందులో ఇచ్చారు.. నెలకు పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి వరకు 22 వేల 56 కోట్లు. అంటే నెలకు 2200 కోట్లు అని భట్టి విక్రమార్క చెబుతుండు. మరి నెలకు 6500 కోట్లు కడుతున్నాని బోగస్ ముఖ్యమంత్రి చెబుతుండు. 4300 కోట్లు ఎక్కడ పోతున్నాయి. టకీటకీమని రైతుబంధు పడుతలేదు. తులం బంగారం వస్తలేదు.. టకీటకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో చూడాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.
మిత్తీలు మాకు అప్పజెప్పినప్పుడు.. 2014లో రాష్ట్ర ఆదాయంలో 21.64 శాతం. 2023లో కేవలం 17.19 శాతం మాత్రమే. ఈ విషయం ఎందుకు చెప్పడం లేదు. రాష్ట్రాన్ని అద్భుతంగా అప్పజెప్పితే.. మీరు ఆగం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక లోటు గరిష్టానికి పడిపోయిందని ఇవాళ వార్తలు. దివాళకోరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే.. వీరి అసమర్థ పాలనలో తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జనవరి నెలఖారు వరకు రెవెన్యూ ఆదాయం ఒక లక్ష 23 వేల 815 కోట్లు సంపాదించుండ్రు.. కానీ ఖర్చు పెట్టింది.. ఒక లక్షా 49 వేల 866 కోట్లు. అంటే రాబడి కంటే ఖర్చు ఎక్కువ ఉంది. కొత్త స్కీం ప్రారంభించలేదు. రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు, స్కూటీలు, తులం బంగారం లేవు, పెన్షన్లు లేవు.. మరి ఎందుకు ఖర్చు పెరిగింది.. ఎందుకు అప్పు చేస్తున్నారో చెప్పగలరా..? మీకు మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పజెప్పితే నువ్వు ఒక ఏడాదిలో ఒక లక్షా 41 వేల కోట్లు అప్పు జేశావు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాల వల్ల హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది. రిజిస్ట్రేషన్లు తగ్గాయి. రియల్ ఎస్టేట్ రంగానికి పొడిచిన వెన్నుపోటు కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి రాజకీయ కక్షలు తెలుసు తప్ప రాష్ట్రాన్ని ఆర్థికంగా బాగు చేయాలనే సోయి లేదు. వ్యవసాయాన్ని చావుదెబ్బ కొట్టావు. వ్యవసాయం సంక్షోభంలో పడింది. పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
KTR | అచ్చోసిన ఆంబోతులా వాగడం రేవంత్ రెడ్డికి అలవాటు : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్.. కేటీఆర్ తీవ్ర విమర్శలు