KTR | హైదరాబాద్ : ఎక్కడపోతే అక్కడ రంకెలేస్తూ.. అచ్చోసిన ఆంబోతులా వాగడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం అయ్యాక కూడా ఆయన భాషలో మార్పు రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పట్నుంచి నేటి వరకు పాడిందే పాటరా.. పాచిపళ్ల దాసరి అన్నట్టు ఉంది.. ఒకటే రాగం ఒకటే మాట తప్ప ఇంకోటి లేదు. రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే ప్రతి కాంగ్రెస్ నేత ఒక ఎజెండా ప్రకారం గోబెల్స్ వారసుల్లాగా ఒకటే సొల్లు పురాణం.. అరిగినపోయిన గ్రామఫోన్ రికార్డులాగా మాట్లాడుతున్నారు. ఒకాయాన దివాళ తీసిన తెలంగాణ అంటడు. ఇంకోకరు నాశమైన తెలంగాణ అని అంటడు, ముఖ్యమంత్రేమో నా రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది.. క్యాన్సర్ వచ్చింది.. ఒక క్యాన్సర్ రోగిలా మారింది అని దివాళకోరు మాటలు మాట్లాడిన బావ దారిద్రపు ముఖ్యమంత్రి బహుషా ఈ దేశ చరిత్రలో రేవంత్ రెడ్డి తప్ప ఎవరు లేరు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
అదే రేవంత్ మూతి మీద తన్నినట్లు, చెంప చెల్లుమనేటట్లు, ఆయన చెప్పే సొల్లు పురాణం తప్పు అన్నట్టు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఫిబ్రవరి 17న సమగ్ర నివేదికను విడుదల చేశారు. ఇది బీఆర్ఎస్ పొంత నివేదిక కాదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్(అట్లాస్). ఇందులో సీఎం మూతిమీద తన్నినట్లు కొన్ని వాస్తవాలు చెప్పారు భట్టి విక్రమార్క. సీఎం పచ్చి అబద్దాలను తిప్పికొడుతూ.. వాస్తవాలను అంగీకరించినందుకు భట్టికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీఎం నిన్న రంకెలు వేశారు. ఎక్కడిపోతే అక్కడ అచ్చోసిన ఆంబోతులా వాగడం ఆయనకు అలవాటైంది. సీఎం అయ్యాక కూడా ఆయన ప్రవర్తన మారడం లేదు. సీఎంకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. సొల్లు మాట్లాడేముందు అట్లాస్‌ను ఒకసారి చదవాలి. మీకు ఓపిక లేఎకపోతే మీ అడ్వైజర్లతో రిపోర్టు తెప్పించుకోండి. ఇది చేయకపోవడంతో రాష్ట్రం పరువు గంగలో కలుస్తుంది. ముఖ్యమంత్రికి ఇంకో విజ్ఞప్తి.. లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చానని అన్నారు. ఇక్కడేమో లంకె బిందెలు లేవు అన్నారు. లంకె బిందెలు ఉన్నాయి.. ఎక్కడ ఉన్నాయో అడ్రస్ చెబుతానని కేటీఆర్ తెలిపారు.
భట్టి విక్రమార్క విడుదల చేసిన నివేదిక వాస్తవాలను చెప్పిందని అనేసరికి.. ఆ విషయం బయటపెట్టిన వెంటనే వెబ్సైట్లో నుంచి ఆ నివేదికను డిలీట్ చేశారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి తీరు. నేను ఈ నివేదికను అందరికి ఇస్తాను.. మా సోషల్ మీడియాలో కూడా పెడుతాను. కాంగ్రెస్ చేసిన ప్రచారం చిల్లర ప్రచారం, అబద్ధం, అసత్యమని నివేదిక ధృవీకరించింది. రాష్ట్ర తలసరి ఆదాయంలో 2014లో మన రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. ఇవాళ నంబర్ వన్ స్థానంలో అంటే 2023లో నంబర్ వన్‌లో ఉందని ఈ నివేదిక స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. ఇదే నివేదికలో 2014-15లో దేశ సగటు తలసరి ఆదాయం 86 వేలు ఉంటే.. మన తలసరి ఆదాయం లక్షా 24 వేలు కానీ ఈ రోజు దేశ సగటు ఒక లక్షా 84 వేలకు పెరిగితే మనది రెండు రెట్లు అంటే 3 లక్షల 56 వేలు ఉందని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎలా పురోగమించింది.. దేశానికి దర్శంగా మారిందినే విషయాన్ని స్పష్టంగా వాస్తవాలను బయటపెట్టింది. ఇదే నివేదికలో రాష్ట్ర సంపద ఎలా పెరిగిందో కూడా చెప్పింది. దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా ఎలా సంపద సృష్టించిందో నివేదిక ఆవిష్కరించింది అని కేటీఆర్ తెలిపారు.