Sree Vishnu Mrithyunjay | టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ట్రైలర్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్ వేదికగా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సుకుమార్ శిష్యుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు క్రైమ్ బ్యూరోలో ఉద్యోగం సంపాదించలేకపోయినా, తన టాలెంట్‌తో ఒక సంక్లిష్టమైన మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.
‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణు – రెబా మోనికా జాన్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై మంచి క్రేజ్ నెలకొంది. కాళ భైరవ సంగీతం, లెజెండరీ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ పనితనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే ‘విష్ణు విన్యాసం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు, వారం రోజుల వ్యవధిలోనే మార్చి 6న ‘మృత్యుంజయ’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.