– జూలూరుపాడు ప్రధాన రహదారి పేరుకే బీటీ రోడ్డు.. కనిపించేది సగం పైగా మట్టి రోడ్డు
– నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
జూలూరుపాడు, ఏప్రిల్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రహదారి పరిస్థితి చూస్తుంటే అద్దం లాంటి రోడ్లు దేవుడెరుగు కానీ.. ఉన్న రోడ్డుపై మట్టిని తీసే నాథుడే కరువు అన్నట్లుగా ఉంది. మండల కేంద్రంలోని తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారి మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.
ప్రభుత్వ రికార్డుల్లో ఇది విశాలమైన బీటి(తారు) రోడ్డు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఇది మట్టి రోడ్డును తలపిస్తోంది. గత రెండేళ్లుగా రోడ్డు విస్తరణ పనులు అస్తవ్యస్తంగా సాగడం, నిర్వహణ లోపించడంతో బీటీ రోడ్డుపై సగానికి పైగా మట్టి పేరుకుపోయింది. వర్షపు నీటితో కొట్టుకొచ్చిన ఇసుక, మట్టి రోడ్డుపైనే పొరలా పేరుకుపోవడంతో అసలు తారు రోడ్డు ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనదారులు బ్రేక్ వేస్తే జారి కిందపడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మట్టి మేటలు, చిన్నచిన్న రాళ్లు కనిపిండకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. చండ్రుగొండ, పాపకొల్లు క్రాస్ రోడ్ల సమీపంలో ప్రతిరోజు ఎవరో ఒకరు పడిపోతుండటం వారు శాపనార్ధాలు పెడుతుండడం నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతుంది.
మట్టి కారణంగా రోడ్డు అంచులు ఎక్కడున్నాయో తెలియక భారీ వాహనాలు వెళ్లేటప్పుడు బాటసారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాలను అధిగమిస్తున్న సమయంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అయినా రోడ్డు భద్రతపై అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం గమనార్హం.
వర్షం వెలిసిన తర్వాత బీటీ రోడ్డుపై ఉన్న మట్టి ఎండిపోయి వాహనాల రాకపోకల తాకిడికి విపరీతమైన దుమ్ము లేస్తోంది. రోడ్డు పక్కన ఉన్న కూరగాయలు, పండ్లు, స్వీట్లు, వస్త్ర దుకాణాలు, కూల్ డ్రింక్స్, కిరాణా షాపులు, సెల్ పాయింట్లు, మీ సేవ కేంద్రాలు, హోటల్లు, ఫ్యాన్సీ షాపుల్లో నిమిషాల్లోనే దుమ్ము పేరుకుపోతోంది. దుమ్ము కారణంగా ఆహార పదార్థాలు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. నిరంతరం ఈ ధూళిని పీల్చడం వల్ల స్థానిక వ్యాపారులు, చుట్టుపక్కల నివాసితులు దగ్గు, ఆస్తమా వంటి తీవ్రమైన శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు.
మండలంలోనే అత్యధిక ఆదాయం కలిగిన వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ అధికారులు వ్యాపారుల వద్ద నుండి లైసెన్స్ ఫీజులు, ఇంటి పన్నుతో పాటు వివిధ రకాల పన్నులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. కానీ అదే ప్రజలు పడుతున్న కనీస ఇబ్బందులను తీర్చడంలో, ప్రధాన రహదారిని శుభ్ర పరచడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఇదే మార్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో సీసీ రోడ్లతో గ్రామాలు మెరిసిపోతుంటే, మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మాత్రం మట్టి దిబ్బలా మారడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని యుద్ధ ప్రాతిపదికన తొలగించి, రోడ్డును శుభ్రపరచాలని.. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని జూలూరుపాడు మండల ప్రజలు కోరుతున్నారు. పట్టణాల్లో ప్రతి రోజూ రోడ్లను అధికారులు శుభ్రం చేస్తున్నారు కానీ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని మాత్రం స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం సరైంది కాదని మండల ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయమై మండల ఎంపీఓ తోట తులశీరామ్ ను వివరణ కోరగా త్వరలోనే రోడ్డును శుభ్రం చేయిస్తామని అకాల వర్షాలు వస్తుండటంతో నీటితో పాటు రోడ్డుపైకి మట్టి చేరుతుండడంతో ఈ సమస్య ఏర్పడుతుందని. వారం రోజుల్లో రోడ్డును శుభ్రం చేయిస్తామని తెలిపారు.