– మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 2 : జిల్లా కేంద్రంతో పాటు, మున్సిపల్ కేంద్రాల్లో పనిచేసే ప్రధాన పత్రికల జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి బ్యూరో ఇన్చార్జులు మర్రి మహేందర్ రెడ్డి, చల్లా సాంబశివరెడ్డి, చింతకింది గణేశ్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు మండలి చైర్మన్, మంత్రికి వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రం, మున్సిపల్ కేంద్రాలలో అన్ని ప్రధాన పత్రికలతో పాటు డెస్క్ లో కూడా అధిక మంది జర్నలిస్టులు పని చేస్తుంటారని, గతంలో మాదిరిగానే యధావిధిగా అందరికీ అక్రిడిటేషన్ వచ్చేలా జీవోను సవరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు చైర్మన్, మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
దీనిపై మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చేలా సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ ప్రియాంక దృష్టికి తీసుకు వెళ్లి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్చార్జి నాగేశ్వరరావు, సాక్షి ఎడిషన్ ఇన్చార్జి బి.జనార్దన్ రెడ్డి, వివిధ పత్రికల రిపోర్టర్లు పులి మామిడి మహేందర్ రెడ్డి, మీసాల శ్రీనివాస్, గుండాల యాదగిరి, జిన్నా శ్రీనివాస్ రెడ్డి, పోగుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

’జిల్లా, మున్సిపల్ కేంద్రాల్లో పనిచేసే ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు’