ప్రకృతి పరిరక్షకులు, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు ఆదివాసీలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడవులను, చెట్లను, పుట్టలను, జంతువులను ప్రేమించే, పూజించే ఆదివాసీలు… ‘జల్, జంగల్, జమీన్’ అని నినదించిన పోరాట యోధుడు కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు అని తెలిపారు.
ఎస్టీల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని, ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.. తండాలను, గిరిజన గూడేలను గ్రామ పంచాయితీలు చేసిందని అన్నారు..
హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్లో ఆదివాసీ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే విధంగా.. కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టడమే కాకుండా, జోడేఘాట్లో సుందరమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
తండాలకు, గూడేలకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయడం, ఎస్టీ గురుకులాలు, కాలేజీల సంఖ్య పెంచడం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించడం, సీఎంఎస్టీఈఐ స్కీం ద్వారా గిరిజన బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో కార్యక్రమాలు కూడా కేసీఆర్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. ఆదివాసీ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.