Mohanlal Apologises | ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరగాల్సిన తన లైవ్ స్టేజ్ షో వీసా సమస్య కారణంగా వాయిదా పడటంతో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఊహించని పరిణామం పట్ల ఆయన అభిమానులకు, నిర్వాహకులకు క్షమాపణలు చెబుతూ సింగపూర్ నుండి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు.
సింగపూర్ లో ఉన్న తనకు ఆస్ట్రేలియా వీసా సమయానికి రాకపోవడం వల్లనే తాను సిడ్నీ వెళ్లలేకపోయానని, అయితే సింగర్ కేఎస్ చిత్రతో సహా మిగతా బృందమంతా ఇప్పటికే సిడ్నీ చేరుకున్నారని ఆయన తెలిపారు. ఇది టెక్నికల్ లేదా క్లెరికల్ పొరపాటు కావచ్చని, దీనికి ఎవరిని తాను బ్లేమ్ చేయదలచుకోలేదని, ఈ తప్పు పూర్తిగా తనదేనంటూ మొత్తం బాధ్యతను తానే మోస్తున్నట్లు మోహన్ లాల్ స్పష్టం చేశారు. ఈ ప్రదర్శన కోసం చాలా దూరం నుండి డ్రైవ్ చేసుకుని వచ్చిన ప్రేక్షకులకు హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతున్నానని, తాను పూర్తిగా అసహాయ స్థితిలో ఉన్నానని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. త్వరలోనే అదే టీమ్‌తో మళ్లీ సిడ్నీకి వచ్చి అద్భుతమైన షోను నిర్వహిస్తామని ఆయన అభిమానులకు గట్టి హామీ ఇచ్చారు.