KTR | హైదరాబాద్ : గ్రామసభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇవాళ ఆగ్రహంతో టెంట్లను కూలగొట్టినట్టే.. రేపు ఏదో దశలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంచిరేవులలోని ఆయన నివాసంలో ఈ సమావేశం జరగ్గా.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు ఈ నెల 28న అనుమతి ఇచ్చింది. అయితే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది.. నిరసన చెప్పొచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారు. మా చిన్న ధర్నాకే ఆగమాగం అయిపోయి.. చివరికి అనుమతి నిరాకరించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్‌భవన్ ముందు ధర్నా చేయొచ్చట. వందలాది వాహనాలు తిరిగే బిజీ రోడ్డు రాజ్‌భవన్ రోడ్డు.. అక్కడ సీఎం, మంత్రులు ధర్నా చేస్తే ట్రాఫిక్‌కు ఇబ్బంది కాదంట. కానీ మేం నల్లగొండ క్లాక్ టవర్ వద్ద ధర్నా చేస్తే.. ట్రాఫిక్ స్తంభించిపోతుందట. అది అంతర్జాతీయ రహదారి అయినట్టు రాష్ట్రాల మధ్య రాకపోకలు దెబ్బతినే విధంగా ఉందని రిపోర్టు ఇచ్చి నిరాకరించారు. చివరకు హైకోర్టు న్యాయం చేసింది. రైతు మహాధర్నాకు అనుమతి ఇచ్చినందుకు హైకోర్టుకు ధన్యవాదాలు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుని రైతుల ఆవేదన, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ తెలిపారు.
ఒక అబద్దాన్ని నిజం చేయడానికి వందసార్లు చెప్తే నిజం అవుతుందనే అపోహలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేం మీలాగా రేషన్ కార్డు ఇచ్చేందుకు హడావుడి చేయలేదు. పబ్లిషిటి చేయాలనే పిచ్చి కాంగ్రెసోళ్లకు ఉంది. మా ప్రభుత్వ హయాంలో 6 లక్షల 47 వేల పైచిలుకు రేషన్ కార్డులు ఇచ్చాం. ఏనాడూ కూడా పబ్లిషిటి చేయలేదు. మీ సేవ ద్వారా లబ్దిదారులు దరఖాస్తు చేసుకుంటే ఇచ్చాం. కానీ మేం అసలు రేషన్ కార్డులు ఇవ్వన్నట్టు కాంగ్రెస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
గ్రామసభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద సమాధానాలు ఉన్నాయా? ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, రైతుబంధు గురించి ప్రజలు అడుగుతున్నారు. వీటికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం వద్ద సత్తా లేదు. అధికారంలోకి రాగానే ప్రజా పాలన పేరిట కోటి 6 లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. రేషన్ కార్డు, రైత భరోసా కోసం దరఖాస్తులు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి తప్పు ఇది.. ఆ దరఖాస్తులు ఎక్కడ..? ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. ప్రభుత్వం పరిపాలనలో నిమగ్నం కావాలి.. ఇతర కార్యక్రమాలు బంద్ చేయాలి. ప్రజలకు మేలు చేసే విధంగా పని చేస్తే నిరసనలు తప్పుతాయి. లేదంటే నిరసనలు తప్పవు. ఇవాళ గ్రామసభల్లో ప్రజలు మర్లబడుతున్నారు.. టెంట్లు కూలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే ఏదో దశలో ప్రజలు తిరస్కరిస్తారు అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పడకేశాయని దేశమంతా అంటోంది. క్రైమ్ రేట్ పెరిగింది. హోం మంత్రి లేరు. సీఎం కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారు. వాళ్ల ప్రయారిటీ ఫార్ములా కేసు.. మా ప్రయారిటీ ఫార్మర్. ఎవరేం అనుకున్నా.. మేం రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Gandhi Bhavan | గాంధీ భవన్లో కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు
KTR | బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Karimnagar | గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్లు మొక్కిన మహిళ : వీడియో