KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితినే కాదు.. భారత రైతు సమితి కూడా అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో పాటు మిగతా అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ అధ్యయన కమిటీ జిల్లా పర్యటనలు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంచిరేవులలోని ఆయన నివాసంలో ఈ సమావేశం జరగ్గా.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈ కమిటీ రాష్ట్రంలో 2023 డిసెంబర్ దాకా ఉన్న పరిస్థితులను, ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేస్తుందని కేటీఆర్ తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేశాం. సాగునీటి పథకాలు కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులను నిర్మించారు కేసీఆర్. స్వయంగా రైతు ఆత్మహత్యలను నివారించే రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో ప్రకటించే స్థాయికి చేరాం. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగాం. భూముల ధరలు పెరగడంతో రైతుల్లో ఒక విశ్వాసం నెలకొంది అని కేటీఆర్ తెలిపారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో వరంగల్ డిక్లరేషన్ పేరిట ఎన్నో హామీలు ఇచ్చింది. పంటకు బోనస్, రైతు భరోసా, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు పెంచుతామని చాలా చెప్పారు. ఇవన్నీ నమ్మిన రైతులు.. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. రాజకీయాల్లో విజయాలు, అపజయాలు జరుగుతుంటాయి. ఇవన్నీ మాకు పెద్ద విషయం కాదు.. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితినే కాదు.. భారత రైతు సమితి కూడా. మా కృషి, సంకల్పం, పోరాటం.. ఈ రాష్ట్రంలో 65 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారంతా బాగుండాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. ఇవాళ ఎన్నికలు లేవు.. అధికారంలోకి రావడానికి రాజకీయమైన ప్రయత్నం కాదు. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అమలు చేయకపోవడంతో, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో రైతులు నిరాశ, నిస్పృహతో ఉన్నారు. ఇప్పటి వరకు 400 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నరు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అని కేటీఆర్ తెలిపారు.
ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది..? ఏం చేస్తే బాగుంటుంది..? అని నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తున్నాం. పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల పట్ల ఉండే ఆవేదన, ఆర్తి ఈ రాష్ట్ర పాలకులకు లేదు. కేసీఆర్ ఆదేశం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశాం. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ రాష్ట్రమంతటా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది. రైతు సంఘాలు, రైతులతో ఎక్కడికక్కడ కలుస్తారు. ఈ నెల 24 నుంచి ఈ కమిటీ పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభిస్తుంది. వ్యవసాయదారులను కలిసి రుణమాఫీ, రైతుభరోసా ఎంత వరకు వస్తుంది. సాగునీటి, కరెంట్ పరిస్థితి, ఇతర ఇబ్బందులు ఏం ఎదుర్కొంటున్నారనే అంశాలను సేకరిస్తారు. రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను నింపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తాం. ఈ కమిటీ వేయాలనే దానికి కారణం ఏంటంటే.. బ్యాంకులో ఒక రైతు రుణమాఫీ కోసం ప్రయత్నం చేసి.. అక్కడే పురుగుల మందు తాగి బ్యాంకు ఆవరణలో కుప్పకూలిపోయాడు. మనసున్న వారు కదలక తప్పదు. ఒక మంచి ఆలోచనతో.. రైతాంగానికి అండగా నిలబడే ఆలోచన మాది. ఈ క్రమంలోనే రైతుల పక్షాన అధ్యయన కమిటీ వేశామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Karimnagar | గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్లు మొక్కిన మహిళ : వీడియో
BRS Party | 28న నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి
KTR | గ్రామసభలను చూస్తే.. కాంగ్రెస్ ప్రజా పాలన తీరు ఏమిటో తెలిసిపోతోంది : కేటీఆర్