Outsourcing Employees | ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్, తీరా గద్దెనెకిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు సైతం ఊడగొడుతున్నది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష కట్టింది.
హైదరాబాద్ , ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా.. జాబ్ క్యాలెండర్ మాటెత్తకపోగా వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపి వారి పొట్టకొడుతున్నది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరో 35 వేల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను సాగనంపేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసింది. మార్చి 31 తరువాత వారిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
జీతభత్యాల భారాన్ని తగ్గించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిరుద్యోగులను బలి చేస్తున్నది. వీలైనంత మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. మార్చి 31 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఏజెన్సీలను ఏర్పాటుచేయలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఔట్సోర్సింగ్ సిబ్బంది తగ్గింపు ప్రభావం కీలకశాఖల మీద పడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ట్రాన్స్కో, జెన్కో, డిసమ్లతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, ఆర్టీసీ, పురపాలక శాఖల్లో ఉద్యోగుల కుదింపు జరుగుతున్నట్టు చెప్తున్నారు. వైద్య కళాశాలలు, దవాఖానల్లోని 776 మంది ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను ఇప్పటికే ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో తొలగింపులు మొదలైనట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,500 మంది మండల, క్లస్టర్ కంప్యూటర్ ఆపరేటర్లు చేస్తున్న పనులు ఇకపై పంచాయతీ సెక్రటరీలు, జీపీవోలు చూసుకోవాలని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించినట్టు తెలిసింది. రెవెన్యూ శాఖలోనూ ఆపరేటర్లు, ఇతర డాటా ఎంట్రీ సిబ్బంది కలిపి మొత్తం 1,200 మంది తొలగింపునకు రంగం సిద్ధమైందని సమాచారం. ఆర్థికశాఖ గణాంకాల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో మొత్తం 4.93 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వీరిలో చాలావరకు బోగస్ ఉద్యోగులు ఉన్నారనే ప్రచారం జరిగింది. దీంతో వారి వివరాలను ఆధార్, పాన్నంబర్లతో అప్ డేట్ చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయితేనే జీతాలు జమచేస్తామని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ తమ వివరాలను సమర్పించారు. అయినా పెద్దగా బోగస్ పేర్లు బయటపడలేదని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వం చేసిందంతా బోగస్ ప్రచారమని తేలిపోయింది. జీతాల భారాన్ని తగ్గించుకునేందుకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కుదించాలని ఆర్థికశాఖ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.