KTR | ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ఖమ్మం సిటీ/ఖమ్మం కమాన్‌బజార్, ఫిబ్రవరి 26 : ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లను కూల్చడమేనా? అంటూ రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శత్రుదేశం మీదికి దండయాత్రకు పోయినట్టు నిరుపేదలపై ఇండ్ల మీదికి బుల్డోజర్లు దింపి దాడికి తెగబడటం ఏమిటంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ దాష్టీకం కారణంగా ఖమ్మం అర్బన్‌లోని వెలుగుమట్ల వినోభాబావేనగర్ భూదాన్ భూము ల్లో ఇండ్లను కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులను గురువారం ఆయన పరామర్శించారు.
నిరాశ్రయులై అంబేద్కర్ భవనంలో ఉన్న ఆ పేదలతో మమేకమైన కేటీఆర్.. అధైర్యపడొద్దని, తామున్నామని ధైర్యం చెప్పారు. న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. సుప్రీంకోర్టుకైనా వెళ్లి పోరాడుతామని స్పష్టంచేశారు. అనంతరం అక్కడే మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు తీరని అన్యాయం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.
గతంలో పలువురు పెద్దలు 62 ఎకరాల ప్రైవేట్ భూమిని భూదాన్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారని తెలిపారు. భూదానమంటేనే పేదలకు వ్యవసాయానికి లేదా ఇండ్లు కట్టుకోవడానికి ఇచ్చేదని పేర్కొన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భూదాన్ ట్రస్ట్ బోర్డు నుంచి 1,895 మందికి 100 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారని చెప్పారు. ఇవాళ ఎవరైనా వచ్చి మీకు హక్కు లేదన్నా, అవి పట్టాలు కాదన్నా.. తప్పకుండా తప్పు వారిదే అవుతుందని పేర్కొన్నారు. పట్టాలు కచ్చితంగా ఉన్నాయని, వాటిని తాను చూశానని, 2014 తర్వాత ఎవరి శక్తి మేరకు వారు ఇండ్లు కట్టుకున్నారని వెల్లడించారు.
‘మీతో కేసీఆర్ సార్ ఒక్కమాట చెప్పమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. మరో రెండున్నరేండ్లలో కేసీఆర్ సీఎం అవుతారు. కాంగ్రెసోళ్లు మిమ్ములను ఎక్కడి నుంచైతే గెంటేశారో, మీకు అక్కడే ఇండ్లు కట్టించి ఇస్తం.
– కేటీఆర్

Ktr
ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు మోసగాళ్లు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈరోజు భూదాన్ భూముల పక్కనే ఉన్న విలాసవంతమైన విల్లాల కోసం, కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం, మంత్రుల అక్రమ సంపాదన కోసం వారు ముగ్గురు కూడబలుక్కొని మొత్తం 60 ఎకరాలను ఆక్రమించుకునేందుకు పేదలను మెడలు పట్టి గెంటేశారని విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసోళ్లను అర్ధరాత్రి వారి ఇండ్ల మీదకు పంపి అన్యాయంగా తరిమేసి బజారున పడేశారని ధ్వజమెత్తారు. ఇంటర్‌తో పాటు పాఠశాలలకు వెళ్లే అనేక మంది పిల్లలకు చదువు లేకుండా చేసి, నోట్లో మన్నుకొట్టి నిలువ నీడ లేకుండా చేసిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పైగా ఆ పట్టాలు అక్రమం అని మంత్రులు చెబుతుండటం దుర్మార్గమని.. పేద ల నోటికాడి బుక్క లాక్కునే బుద్ధి మీ ముగ్గురు మం త్రులదంటూ నిప్పులు చెరిగారు. ‘గతంలో మీ ప్రభు త్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడెవరూ ఇబ్బందులు పెట్టలేదని, కలెక్టరేట్ కట్టినా, కేసీఆర్ సార్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినా ఎన్నడూ చీమకు చేసిన హాని కూడా చేయలేదు. మమ్మల్ని కాపాడుకున్నడు తప్ప ఇంకోటి కాదు’ అని వెలుగుమట్లలోని బాధితులు తనతో చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.

‘మీతో కేసీఆర్ సార్ ఒక్కమాట చెప్పమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. మరో రెండున్నరేండ్లలో కేసీఆర్ సీఎం అవుతారు. కాంగ్రెసోళ్లు మిమ్ములను ఎక్కడి నుంచైతే గెంటేశారో, మీకు అక్కడే ఇండ్లు కట్టించి ఇస్తం’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు. అందుకోసం అప్పటివరకు ఆగాల్సిన అవసరం లేదు. మీ అందరికీ అక్కడే క్రమబద్ధం చేయాలని, మీ తరఫున శాసనసభ, శాసనమండలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని అభయమిచ్చారు. ‘మీరు ధైర్యంగా ఉండండి.

భోజనం, వసతి అన్నీ ఏర్పాటు చేస్తం. న్యాయ పోరాటం చేస్తం. ఎవ్వరి వద్ద రూ పాయి తీసుకోం. మేమే ఖర్చు పెడుతం. మీకు న్యాయం జరిగే దాకా మీతోనే ఉంటం’ అని కేటీఆర్ చెప్పగానే బాధితుల నుంచి చప్పట్లతో సంతోషం వ్యక్తంచేశారు. మళ్లీ ప్రభుత్వం నుంచి ఎవరైనా వస్తే చెదిరిపోయి సంతకాలు పెట్టొదని, మళ్లీ మళ్లీ మోసం చేస్తారని హెచ్చరించారు. రెండున్నరేండ్ల క్రితం ఎలా గారడీ చేశారో చూశాం కదా! తులం బంగారం, ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తమని ఇచ్చారా? అని ప్రశ్నించగా ఇవ్వలేదంటూ వారు బదులిచ్చారు.
‘ఇందిరమ్మ ఇండ్లు ఇస్తమని.. ఉన్న ఇండ్లు పోగొడుతున్నరు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కూల్చివేతలే. రాష్ట్రం అంతటా కూల్చివేతలే. ఖమ్మం వెలుగుమట్లలో కూల్చివేతలే..’ అని కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. మొత్తం రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, శక్తిని లాక్కోవడమే తప్ప రెండున్నరేండ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఆలోచించాలని కోరారు. అందుకే దండం పెట్టి చెబుతున్నా మీరు ఐకమత్యంగా ఉంటే తాము సాయం చేయగలుగుతామని హామీ ఇచ్చారు.

ఇక్కడకు ఇతర పార్టీల వారి కూడా వచ్చారని తప్పకుండా కలిసి కొట్లాడుతామని ఓట్ల కోసం తాపత్రయ పడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. కేవలం పేదలకు న్యాయం చేసేందుకే వచ్చానని మీకు న్యాయం జరిగేదాక ఈ ప్రభుత్వం, ముగ్గురు మోసగాళ్లకు బుద్ధి చెప్పేదాకా కొట్లాడుతామని స్పష్టం చేశారు. బాధితులకు ఖమ్మం ప్రజానీకమే కాదు యావత్ రాష్ట్ర ప్రజానీకమే ఉన్నదని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు అందరూ ఇక్కడే ఉన్నారని, మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడుకుని మీ స్థలం మీకు వచ్చేలా చేయడం తమ బాధ్యత అని హామీ ఇచ్చారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూల్చడం అత్యంత దుర్మార్గం. కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యంపై చట్టసభల్లో నిలదీస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. న్యాయం జరిగేదాకా వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటం. మరో రెండున్నరేండ్లలో కేసీఆర్ సీఎం అవుతారు. కాంగ్రెసోళ్లు మిమ్ములను ఎక్కడి నుంచైతే గెంటేశారో, మీకు అక్కడే ఇండ్లు కట్టించి ఇస్తం’
– కేటీఆర్
‘మీ ముగ్గురు మంత్రులు మాయగాళ్లు. రేపు మీ మధ్యన చిచ్చు పెడతారు. మీలో ఓ యాభై మందిని తీసుకొనిపోయి వేలిముద్రలు వేయించుకుంటారు. అధికారులను పంపించి కొంతమందితో సంతకాలు పెట్టించుకుంటరు. దయచేసి జాగ్రత్తగా, ఐకమత్యంగా ఉండండి’ అని కేటీఆర్ వారిని కోరారు. మీకు అక్కడే ఇండ్లు కావాలనుకుంటే ఎక్కడా సంతకాలు పెట్టకండి. పొరపాటున కూడా ఐకమత్యాన్ని చెదిరిపోనీయకండి’ అని చెప్పారు. ‘ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. మీరు రండి.. ఇగో ఇవే ఇండ్లు అని చూపిస్తరు. ఎట్లయితే ఆరు గ్యారెంటీలు చెప్పి చేతుల్లో గారడీ చూశారో మళ్లీ అట్లనే అరచేతిలో వైకుంఠం చూపెడతారు. అందుకే దయచేసి జాగ్రత్తగా ఉండండి.
మీరు గెలువాలంటే ఐకమత్యం అవసరం’ అని హితబోధ చేశారు. ప్రభుత్వం తప్పు చేసిందని రాష్ట్రం మొత్తం భావిస్తున్నదని, ఏ తప్పూ చేయకపోతే ఖమ్మం ఆర్డీవోను హడావిడిగా ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. ‘అర్ధరాత్రి వచ్చి ఎందుకు దొంగల్లా ఇండ్ల మీద పడ్డారు. నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. గతంలో మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మీకు పట్టాలు లేకపోతే కోర్టు ఆర్డర్ ఇస్తదా? జిల్లాలోని ముగ్గురు మంత్రులు తప్పు చేయకపోతే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా. తప్పు ప్రభుత్వానిది కాబట్టే మీ ముందుకు రాలేకపోతున్నా’రంటూ మండిపడ్డారు.

కేటీఆర్ వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా ఆధ్యక్షుడు రేగా కాంతారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా నాయకులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియ, బానోత్ చంద్రావత్, దిండిగాల రాజేందర్, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, వలరాజు, కోటి తదితరులు ఉన్నారు.
‘సార్ మాకు మీరే న్యాయం చేయాలి. ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా కూకటివేళ్లతో కూల్చివేసింది. మీరే మాకు న్యాయం చేయాలి. ఉండేందుకు ఇండ్లు ఇప్పించి ఆదుకోవాలి’ అని వెలుగుమట్ల భూదాన్ బాధితులు కేటీఆర్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడ సుమారు 62.7 ఎకరాల భూదాన్ భూమి ఉన్నదని 2014లో 1,898 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చారని వారు తెలిపారు. తమకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇది ప్రభుత్వపరమైందని అంటున్నారని, తాము 2018 నుంచి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకొని ఉంటున్నామని కేటీఆర్‌కు చెప్పుకొన్నారు.
ఇక్కడ ఎలాంటి విద్యుత్, తాగునీరు, రోడ్లు లేకున్నా తాము సొంతంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నట్టు వివరించారు. అప్పటి నుంచి విద్యుత్తు బిల్లులు, ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రూపాయి.. రూపాయి కూడబెట్టి ఇండ్లు కట్టుకుంటే రాత్రికిరాత్రి నేలమట్టం చేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పుకొన్నారు. అందరం రోజువారీ కూలిప నులు చేసుకుని బతికేవాళ్లమేనని, ఇప్పడు ఎక్కడికి పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దగ్గ ర్లోనే కలెక్టరేట్ ఉన్నా తమకు ఎలాంటి సౌకర్యా లు కల్పించలేదని చెప్పారు. తమ పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయని, ఈ సమయంలోనే రోడ్డున పడేశారని బోరున విలపించారు. తాము ఎక్కడికి వెళ్లాలని, ఎవరు ఆదుకుంటారని, ఇంటి అద్దెలు చెల్లించే పరిస్థితుల్లో తాము లేమని, రెక్కాడితే డొక్కాడే పరిస్థితులు తమవి అని కేటీఆర్‌కు వివరించారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఇక్కడే ఇండ్లు కట్టించి గృహప్రవేశం కూడా చేయిస్తామని వారికి హామీ ఇచ్చారు.
కేటీఆర్ అన్నా మా గోస చూడు నా భార్య పుస్తెలతాడు, బంగారం తాకట్టు పెట్టి రూ.7 లక్షలతో ఇల్లు కట్టుకున్న. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని అధికారులు వచ్చి ఇల్లు కూలగొట్టారు. మేం ఎట్లా బతకాలె.
– కేటీఆర్‌తో ఓ తమ్ముడి కన్నీటి గోస
పదేండ్ల నుంచి ఇక్కడే ఉంటున్న. పన్నెండు లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టిన. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం చేయవట్టి ఇప్పుడు నా భార్యా, పిల్లలు, కుటుంబం మొత్తం రోడ్డున పడింది.
– జానీమియా
మాకు భూదాన్ ట్రస్ట్ బోర్డు నుంచి ఇచ్చిన పట్టాలు ఉన్నయ్. కొంతమందిమి కరెంటు కోసం దరఖాస్తు పెట్టుకున్నం. ఇంటి పన్ను కూడా కడుతున్నం. ఇంటి నెంబర్లు కూడా వచ్చినట్టే వచ్చి ఆగినయ్. ఇప్పుడు వీళ్లచ్చి ఇండ్లన్నీ కూలగొట్టి మమ్ముల మెడలు వట్టి రోడ్డు మీద పడేశిన్రు.
– ఎర్రయ్య
ఉపాధి పనుల కోసం వచ్చిన మేము భూదాన్ భూముల్లో ఇల్లు కట్టుకొని బతుకుతున్నం. ఎనిమిదేండ్ల నుంచి ఇక్కడే ఉంటూ ఖమ్మంలో కూలీ పనులు చేసుకుంటున్నం. భూదాన్ బోర్డు నుంచి పట్టాలు ఇచ్చినప్పటికీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ పత్రాలు అని ప్రచారం చేస్తాంది. జేసీబీలు, బుల్డోజర్లతో వచ్చి మా ఇండ్లు కూలగొట్టిన్రు. ఇప్పుడు ఆర్థికంగా ఎంతో నష్టపోయాను. ఈ ప్రభుత్వం నా కుటుంబాన్ని ఆగం చేసింది. భూమిని కోల్పోయిన దగ్గరే ఇండ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి.
– నరాటి సత్యనారాయణ, బాధితుడు
తొమ్మిదేండ్ల కింద ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని కాంగ్రెస్ సర్కార్ రాత్రికిరాత్రే కూలగొట్టింది. రోజూ కూలి పనులు చేసుకొని బతికేటోళ్లం. గీ సర్కార్ వచ్చిన రోడ్డు మీద పడేసింది. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కాంగ్రెసోళ్లను నమ్మి వారికి ఓటు వేస్తే మాలాంటి పేదోళ్లను ఇబ్బందులు పెట్టుడు ఎంతవరకు కరెక్టు. మా ఉసురు కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వానికి తప్పకుండా తగుల్తది. ప్రభుత్వం వెంటనే తమకు న్యా యం చేసి ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం.
– పావురాల శేషగిరి, బాధితుడు