KTR | హైదరాబాద్ : మార్పు, మార్పు అనుకుంటూ అందరి కొంపలు పుచ్చుకున్నారు ఈ కాంగ్రెసోళ్లు అని రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్ వద్ద “ఆటో డ్రైవర్ల మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకొలే. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో అభివృద్ధి ఫలాలు అనుభవించామని… రోజుకు దాదాపు రూ. 2 వేలు సంపాదించే పరిస్థితి ఉండేదని ఆటో డ్రైవర్లు చెప్పారు. ఇప్పుడు రూ. 200 నుంచి రూ. 300 కూడా సంపాదించలేని పరిస్థితి వచ్చిందని ఆటోడ్రైైవర్లు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. దాదాపు ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గతేడాది రాహుల్ గాంధీ వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ల సమస్యలు తీరుస్తానని రంగుల కల చూపించారు. నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మనం మంచి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ. 2500 ఇస్తా అన్నారు. వాటిని ఇవ్వాలని కోరుతున్నాం. కానీ గత 11 నెలల్లో వీళ్లు చెప్పిన దానికి చేసిన దానికి ఎంత తేడా ఉందో…ఏం మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలని ఆటో అన్నలను కోరుతున్నాని కేటీఆర్ పేర్కొన్నారు.
రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఈ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకొలే. శాసన సభలో ఆత్మహత్యలు చేసుకున్న వారి పేర్లతో సహా మేము చెప్పాం. వాళ్ల కుటుంబాలను కూడా ఆదుకోలేదు. ఉచిత బస్సు ప్రయాణానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న నెలకు వెయ్యితో పాటు రూ. 5 వేలు నెలకు ఇవ్వాలని కోరుతున్నా. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వచ్చే శాసనసభ సమావేశాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను ఆటో డ్రైవర్లు కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను నేరవేర్చాలి. మా ప్రభుత్వం తెచ్చిన ఇన్సూరెన్స్‌ను తీసివేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అది సరికాదు. కేంద్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇబ్బంది పెట్టేలా చట్టం చేసింది. అది కూడా రద్దు చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు చాలా హామీలు ఇచ్చి…మీ నోట్లో మట్టి కొట్టింది. రాహుల్ గాంధీ చెప్పిన తియ్యని, కమ్మని మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్లు ఇక్కడకు ఎక్కువ మంది రాకుండా పోలీసులు ప్రయత్నం చేశారు. దయచేసి పోలీసులు అలా చేయవద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీతోనే కొట్టించే పరిస్థితి తీసుకువచ్చారు. పోలీసులు డ్యూటీలు చేయండి. కానీ పేద వాళ్ల పట్ల దయతో ఉండండి. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళితే రేవంత్ రెడ్డిని తన్నే పరిస్థితి ఉంది. అందుకే ఆయనకు భయం పట్టుకుంది. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీ సభలో కాంగ్రెస్ నాయకుడే మనం బయటకు వెళితే తన్నే పరిస్థితి ఉందని చెప్పాడు. మనం ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని చెప్పాడు. రేవంత్ రెడ్డికి పోలీసుల మీద కూడా నమ్మకం లేక సెక్యూరిటీలో నుంచి బెటాలియన్ పోలీసులను తీసేశారు. నిరుద్యోగులు, రైతులు, వృద్ధులు, మహిళలు అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా సరే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని మనం కోరుతున్నాం. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరముంది. మీ తరఫున శాసనసభలోనూ మేము పోరాటం చేస్తాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా భయపడకుండా పోరాటం చేసే వాళ్ల సమస్యలకు మద్దతుగా నిలవాలని కోరుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రాహుల్.. అ‘శోక’ నగర్‌ను సందర్శించండి: హరీశ్‌రావు
Rahul Gandhi | రాహుల్‌కు ఆహ్వానం పలుకుతూ.. వెలసిన రేవంత్ రెడ్డి-అదానీ ఫ్లెక్సీలు
KTR | కాంగ్రెస్ పాలనలో.. పిచ్చోడి చేతిలో రాయిలా మారిన తెలంగాణ: కేటీఆర్