జనగామ, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : భూ భారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యను సాకుగా చూపి రైతులను కాంగ్రెస్ సర్కార్ నిలువు దోపిడీ చేస్తున్నది. గిఫ్ట్ డీడ్ ఆప్షన్ లేకపోవడంతో సేల్ డీడ్‌ను ఎంచుకోవాల్సి వస్తున్నది. ఫలితంగా డబుల్ చార్జీలు చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటికే కొత్త సాఫ్ట్‌వేర్‌లో చిన్న చార్జీలకు ‘లాక్’.. భారీ చెల్లింపులకు ‘ఎడిట్’ ఆప్షన్ లొసుగు ఆసరాగా చేతివాటం ప్రదర్శించి ‘డిజిటల్ దోపిడీ’తో ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు గండికొట్టిన విషయం విదితమే.
ఇందులో జనరేట్ అయిన చలానా ఎంత? ఖజానాకు చేరిందెంత? ఆన్లైన్ లెక్కల్లో ఉన్నదెంత? దీనివెనుక ఎవరెవరి ప్రమేయం ఉన్నది? దారిమళ్లిన సొమ్ము ఎక్కడికి చేరింది? అనే అంశాలపై హైలెవల్ కమిటీ దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ విషయమై కొద్దిరోజులుగా అమ్మకందారులు, కొనుగోలుదారుల్లో గందరగోళం నెలకొని ఉండగానే తాజాగా భూ భారతి పోర్టల్‌లో బహుమతి రిజిస్ట్రేషన్ ఆప్షన్ మాయమైంది. భూముల లావాదేవీల కోసం ప్రతిష్ఠాత్మకంగా కొత్త పోర్టల్ తెచ్చామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు తిరకాసులు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది.
ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత పేరుతో క్షేత్రస్థాయిలో రైతులకు చుక్కలు చూపిస్తున్నది. కుటుంబ సభ్యుల మధ్య జరిగే బహుమతి రిజిస్ట్రేషన్ (గిఫ్ట్ డీడ్) ఆప్షన్‌ను ఏకంగా పోర్టల్ నుంచి తీసివేసింది. భూభారతి వెబ్సైట్లో లావాదేవీలు గమనిస్తే ప్రభుత్వ వ్యూహం అర్థమవుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. భూమిని అమ్ముకోవాలనుకునే వారికి సేల్ డీడ్ కింద స్లాట్లు సులభంగా బుక్ అవుతున్నాయి. ఇందులో ప్రభుత్వానికి భారీగా రిజిస్ట్రేషన్ ఫీజు (దాదాపు 7.5 శాతానికిపైగా) వస్తుంది. తండ్రి నుంచి కొడుకులు లేదా రక్త సంబంధీకులకు భూమిని బహుమతిగా ఇచ్చే గిఫ్ట్ డీడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సాంకేతిక లోపమని చూపించడం లేదా అసలు ఆ ఆప్షన్ ఎనేబుల్ కాకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
అదనపు ఆదాయం కోసమేనా?
రక్త సంబంధీకుల మధ్య గిఫ్ట్ డీడ్ జరిగితే ప్రభుత్వానికి 3% స్టాంపు డ్యూటీ వస్తుంది. సేల్‌డీడ్ ద్వారా అయితే 7.5 శాతానికిపైగానే వస్తుంది. గిఫ్ట్‌డీడ్ ఆప్షన్ లేకపోవడంతో చాలామంది సేల్ డీడ్ ఆప్షన్ ద్వారా 7 శాతానికిపైగా డ్యూటీ చెల్లిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఖజానా నింపే అడ్డదారి కాదా? అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎకరం భూమిని కొడుకు పేరిట గిఫ్ట్ డీడ్ చేయడానికి అయ్యే ఖర్చు కంటే, సేల్ డీడ్ చేస్తే వచ్చే ఖర్చు రెండింతల కంటే ఎక్కువగా ఉంటున్నది. సామాన్య రైతుకు ఇది పెనుభారం. మీ సేవా కేంద్రాల చుట్టూ, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఆప్షన్ రావడం లేదనే సమాధానమే వినిపిస్తున్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి భూభారతి పోర్టల్‌లో గిఫ్ట్ డీడ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.