KTR | హైదరాబాద్ : గుజరాతీ గులాంలు.. ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి కచ్చితంగా ప్రమాదం ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. గులాబీ పార్టీవోడు ఉండాలి తప్ప గులాంల పార్టీవోడు కాదు అని కేటీఆర్ తెలిపారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రసంగించారు.
1956లో జరిగిన ఒక్క పొరపాటుకు 2014 వరకు అన్యాయం జరిగింది. ఒక్క పొరపాటుకు మూడు తరాలు క్షోభ అనుభవించాయి. తెలంగాణ వచ్చిందని ఉద్యమ యాది ఎందుకు అనుకుంటే పొరపాటు అవుతుంది. నిన్నటి పోరాటంలో హీరోలు, విలన్లు ఎవరో తెలిపితే.. ఈతరం జాగ్రత్త పడుతది. ఎవర్ని ఎక్కడ పెట్టాల్నో అక్కడ పెడుతుది. శత్రువులు కుట్రలు చేస్తూనే ఉంటారు. ప్రత్యర్థులు దాడులు చేస్తూనే ఉంటారు. తెలంగాణ ఏర్పాటుతో నష్టపోయిన శక్తులు ఏదో రూపంలో పెత్తన కోసం ఆరాటపడుతూనే ఉంటారు. కేసీఆర్ సీఎం పదవి నుంచి దిగిపోగానే నిన్నటి వరకు అణిగిమనిగి ఉన్న కొన్ని శక్తులు ఎలా రెచ్చిపోతున్నాయో ఆలోచించండి. సమైక్యాంధ్రుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అంటుడు.. సోనియమ్మ లేకపోతే తెలంగాణ అడుక్కుతింటుండే అని అహంకారంతో మాట్లాడుతున్నాడు. తెలంగాణ విద్యార్థుల ఆత్మబలిదానాలను, పోరాటాలను కించపరుస్తున్నాడు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండు అని ఒకాయన అంటడు. ఒక గుజరాతీ వచ్చి విడిపించిండు.. మరో గుజారతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తుండు అని ఒకాయన అంటున్నాడు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు అవమానించే విధంగా నోరు పారేసుకుంటున్నారు. గుజరాతీ గులాంలు, ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి కచ్చితంగా ప్రమాదం ఉంది. తెలంగాణ సమాజానికి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. గులాబీ పార్టీ వోడు ఉండాలి తప్ప గులాంల పార్టీవోడు కాదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంపై ఎక్కుపెట్టిన నాయకుడు సీఎం అయిండు.. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లను కాదు.. తెలంగాణ ఆనవాళ్లను చెరిపేయాలనుకుంటున్నాడు. తెలంగాణ రాజముద్రలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ తీసేస్తా అంటున్నాడు. దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నడు. మనందరం ప్రణమిల్లే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తా అంటున్నడు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి స్థానాన్ని కబ్జా పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నడు. నీళ్లు, నిధులు నియమాకాలు ఉద్యమ నినాదం కాదని నీలుగుతున్నాడు. ఇవి మమూలుగా తీసుకునే విషయం కాదు.. తెలంగాణ వీర చరిత్రను తుడిచివేసే ప్రయత్నం చేస్తున్నాడు. కచ్చితంగా తెలంగాణలోని కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యోగ సంఘాలు.. ప్రతి బిడ్డ వీరిని చీల్చి చెండాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ జాతి వ్యథను రేపటి తరానికి నరనరాన ఎక్కించాలి : కేటీఆర్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వానిది లేకి బుద్ధి.. నిప్పులు చెరిగిన కేటీఆర్
RS Praveen Kumar | మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్