KTR | హైదరాబాద్ : పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి.. ప్రాణ త్యాగానికి వెనుకాడకుండా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రసంగించారు.
మన జాతికి మహత్తరమైన పోరాట చరిత్ర ఉంది. అది తెలంగాణ సాయుధ పోరాటం కావొచ్చు.. వీరోచితమైన ఉద్యమ గాథ కావొచ్చు. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలమ్మ పోరాటాల్లో వెనక్కి పోలేదు. ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ మనది. ఒక తెలంగాణ ఉద్యమ రూపంలోనే కాకుండా సాయుధ పోరాటంలో కూడా షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, మగ్దూం మొయినుద్దీన్ లాంటి వారు పోరాటలు చేశారు. స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి, సంకెళ్లను తెంచుకున్న సందర్భం.. విజయం మన జాతికి ఉన్నది. కుట్రలను, కుతంత్రాలను చేధించి.. యావత్ జాతిని ఏకతాటి మీదికి తీసుకొచ్చి శాంతియుత పంథాలో వ్యూహాలు, ఎత్తగడలు రచించి ఉక్కు సంకల్పంతో గమ్యాన్ని ముద్దాడిన నాయకులు ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమైన దండి యాత్ర, సహాయ నిరాకరణ ఉన్నట్టే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మహోజ్వల సందర్భాలు ఉన్నాయి. 1948 నుంచి 1956 వరకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా హైదరాబాద్ ఉండే. ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా, ఎస్సార్సీ కమిషన్‌కు సిఫారసులకు వ్యతిరేకంగా 1956లో బలవంతపు పెళ్లి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి తొలి ప్రధాని నెహ్రూ.. నిజామాబాద్‌లోని ఖలీల్ వాడి మైదానంలో మాట్లాడుతూ.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాం.. అమాయకపు ఆడపిల్లకు అతి హుషారైన మగపిల్లాడితో పెళ్లి చేస్తున్నాం. ఒక వేళ వీళ్ల కలయిక మంచిగా సాగకపోతే విడాకులు తీసుకోవచ్చని నెహ్రూ చెప్పారు. ఆయన అనుమానించినట్టే, తెలంగాణ సమాజం అనుమానించినట్టే.. తెలంగాణకు అన్యాయాల పరంపర ప్రారంభమైంది. పెద్ద మనషుల ఒప్పందం తుంగలో తొక్కారు. మొదటి రోజు నుంచే ఉల్లంఘనలు ప్రారంభమయ్యాయి. 1956 నుంచి 1968 వరకు తెలంగాణ ఉడికిపోయింది. ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేసి తెలంగాణ కావాలని పోరాటం చేశారు. 1968 నుంచి 1971 వరకు తెలంగాణ అట్టుడికిపోయింది.. పోలీసుల కాల్పులు జరిగాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తొక్కే ప్రయత్నం చేసింది. 370 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
1971లో దేశ వ్యాప్తంగా ఇందిరా గాంధీ హవా ఉంటే.. తెలంగాణలో మాత్రం 14 ఎంపీ స్థానాలకు గానూ 11 ఎంపీ సీట్లను తెలంగాణ ప్రజా సమితికి ఇచ్చి తమ గుండెను చీల్చి ఆత్మను ఢిల్లీ ముందు తెలంగాణ ప్రజలు పెట్టారు. మా తెలంగాణ మాకు కావాలని తీర్పునిచ్చారు. కానీ ఆ ప్రజాస్వామ్య తీర్పును కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది. తెలంగాణ ప్రజా సమితి ఎంపీలను కాంగ్రెస్‌లో కలుపుకుని రకరకాల ఆలోచనలతో 30 ఏండ్ల పాటు తెలంగాణ ఆకాంక్షలను తొక్కిపెట్టింది. 2001 ఏప్రిల్ మాసంలో మన నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. పదవుల కోసం తెలంగాణను వాడుకుంటారనే అనుమానం ఉండే. కాబట్టి పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి, ఆఖరి ప్రాణత్యాగానికి వెనుకాడకుండా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్. చివరకు ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించాడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ జాతి వ్యథను రేపటి తరానికి నరనరాన ఎక్కించాలి : కేటీఆర్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వానిది లేకి బుద్ధి.. నిప్పులు చెరిగిన కేటీఆర్
RS Praveen Kumar | మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్