KTR | హైదరాబాద్ : మన కథను, తెలంగాణ జాతి వ్యథను రేపటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. లేకపోతే మళ్లీ మన తెలంగాణ జాతి పరాయి దండయాత్రలో ఓడిపోయే ప్రమాదం ఉన్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వం దాడి రూపంలో కనబడుతుంది మనకు అని కేటీఆర్ తెలిపారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రసంగించారు.
ప్రతి జాతి తన ఘనమైన వైభవాన్ని పోరాటాలను, త్యాగాలను, విజయాలను కథగానో పాటల రూపంలోనూ నిత్యం తెలియజేస్తూనే ఉంటేనే తర్వాతి తరాలకు తెలుస్తోంది. వీరులను, వీరగాథలను, వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి జాతి, ప్రతి దేశం తన ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురున్న యువతకు ఆ పౌరుషాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తోంది. పోరాటాల గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. రామాయణం, మహాభారత ఇతిహాసాలను పద్యాలుగా, నాటకాలుగా, గ్రంథాలుగా ప్రతి తరాన్ని చేరి భారత జాతిని ఐక్యంగా నిలబెట్టాయి. అదే మాదిరిగా తెలంగాణ జన సంప్రదాయంలో ఒగ్గు కథలు, బుర్ర కథలు, యక్షగానాలు, బతుకమ్మ పాటలు, నృత్య రూపాలు, చిత్రకళలు, చరిత్ర పాఠాలు, శిలాశాసనాలు ఎన్నెన్నో రకాలుగా ఘనమైన సంస్కృతిని, మహానీయులను, వైతాళికులను గుర్తు చేసుకునే విధంగా మనకు ఉపయోగపడ్డాయని కేటీఆర్ తెలిపారు.
ఏ జాతి అయితే తన చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మారిపోతోంది. ఒక ప్రాంతాన్నో, ఒక దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు.. పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తారు. మానసిక దాడి చేసి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. బ్రిటీష్ వారి నుంచి మొదలుకుంటే సమైక్యాంధ్ర శక్తుల దాకా ఇదే ప్రయోగం చేశారు. తెలంగాణ భావజాలం మీద కూడా అనేక దాడులు జరిగాయి. ఆంధ్రా – తెలంగాణ పంచాయితీలు, హైదరాబాద్ అట్టుడికిపోతుందని, తెలంగాణ నాయకత్వానికి పరిపాలన సమర్థత లేదని దాడి జరిగింది. కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా భారతదేశంలో తెలంగాణ నవంబర్ వన్‌గా నిలబెట్టారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఒక జాతి సంక్షోభంలో ఉన్నప్పుడు తల్లడిల్లుతున్నప్పుడు ఒక యోధుడు పుడుతాడు. ఆ యోధుడు స్పార్టకస్, గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా.. ఎవరో ఒకరు పుట్టి.. ఆ జాతిని మేల్కోలిపితే కదిలి మళ్లీ తిరిగి స్వాతంత్ర్యం సాధించుకున్నారు. ప్రతి దేశానికి, ప్రాంతానికి, జాతికి ఒక కథ ఉంటుంది. ఒక కథా నాయకుడు ఉంటాడు. ప్రతినాయకులు ఉంటారు. త్యాగాలు, విద్రోహాలు ఉంటాయి. జయాలు, అపజయాలు ఉంటాయి. ఎదురుదెబ్బలు, గుణపాఠాలు ఉంటాయి. అలాగే తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథా నాయకుడు కలిసొచ్చే కాలానికి నడిపొచ్చే కొడుకు 2001లో గులాబీ జెండాతో తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో మన ముందుకు వచ్చాడు. మన కథను తెలంగాణ జాతి వ్యథను రేపటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన బాధ్యత ఉన్నది. లేకపోతే మళ్లీ మన తెలంగాణ జాతి పరాయి దండయాత్రలో ఓడిపోయే ప్రమాదం ఉన్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వం దాడి రూపంలో మనకు కనబడుతుందని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ ప్రభుత్వానిది లేకి బుద్ధి.. నిప్పులు చెరిగిన కేటీఆర్
RS Praveen Kumar | మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్
KTR | కేసీఆర్ గురించి ఆసక్తికర విషయాలు.. దీక్షా దివస్‌లో కేటీఆర్ వెల్లడి