KTR | కరీంనగర్ : తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయమైతే.. నువ్వు ఆయన కాలిగోటికి కూడా సరిపోవు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. నీకు అధికారం ఉండొచ్చు.. కానీ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆర్ అంటేనే ఎనలేని అభిమానం ఉందని కేటీఆర్ తెలిపారు. దీక్షా దివాస్ సందర్భంగా కరీంనగర్లోని అల్గునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కరీంనగర్ వేదికగా రణగర్జనతో కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టండంటూ ఎంతో ధైర్యంగా కేసీఆర్ ప్రకటన చేశారు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతూ కేసీఆర్ను తక్కువ చేయాలని ప్రయత్నించవచ్చు. కానీ కేసీఆర్ 2001లో తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా ఆయనకు 46 ఏళ్లు మాత్రమే. ఆయనకు నిజంగా పదవుల మీద మోజు ఉంటే అప్పటి ముఖ్యమంత్రి ఇచ్చిన మంత్రి పదవి ఆఫర్ ను తీసుకొని హాయిగా ఉండవచ్చు. తెలంగాణ నాయకులు పదవుల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెడతారన్న అపవాదుకు వ్యతిరేకంగా ముందు తన పదవులకు రాజీనామా చేసి ఆయన పార్టీ ప్రారంభించారు. 14 ఏళ్లు ఎదురుదెబ్బలు, విజయాలు, అపజయాలు, ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నారు అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ కర్కషత్వం కారణంగా తెలంగాణ ప్రజల్లో నిప్పు పుట్టింది. ఈ రోజు తెలంగాణ సాధన జరిగిందంటే అందుకు దాని మూడు కారణాలు. ఒకటి కేసీఆర్ నాయకత్వం, రెండు అమరుల ప్రాణత్యాగం, మూడోది కాంగ్రెస్ కర్కషత్వం. కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష కారణంగా రాష్ట్రం ఇవ్వకపోతే వీపు చింతపండు అవుతదనే పరిస్థితి వచ్చింది. విధి లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చింది. తెలంగాణ ఉద్యమంలో మన మీద తుపాకీ పట్టినోడు ఇప్పుడు ఏదేదో వాగుతున్నాడు. ఎన్నో అబద్దపు హామీలు, ఆరు గ్యారంటీలు, నంగనాచి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో ఏ వర్గాన్ని నీ పాలన గురించి అడిగినా సరే బోరున ఏడుస్తున్నారు. గురుకులాలల్లో విద్యార్థులకు కనీసం సరైన భోజనం పెట్టలేక వాళ్లు చనిపోతున్న పరిస్థితి. ఈ పాటి పాలనకు విజయోత్సవాలంట. పోలీసులు లేకుండా ప్రజల్లోకి పోతే ఉరికించి కొట్టే పరిస్థితి ఉందని కేటీఆర్ తెలిపారు.
ఇప్పుడంటే బీఆర్ఎస్కు ఎంతోమంది నాయకులు, పెద్ద బలగం ఉంది. కానీ 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడు ఎవరూ లేరు. ఆ నాడు మనీ, మజిల్, మీడియా, క్యాస్ట్ ఇలా ఏ పవర్ లేదు. తెలంగాణ వస్తదా అని అందరికీ అనుమానాలు ఉండె. అనుమానాల నీలి నీడల మధ్య ఆగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేసీఆర్ అంటే ఒక పేరు కాదు.. కేసీఆర్ అంటే ఒక పోరు : కేటీఆర్
KTR | పండిన పంట ఎంత..? కొన్న ధాన్యం ఎంత..? కాంగ్రెస్ సర్కార్కు కేటీఆర్ సూటి ప్రశ్న