– కార్మికుల ఆవేదన, యాజమాన్యంపై విమర్శలు
రుద్రంపూర్, మార్చి 06 : తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన షెడ్యూల్డ్ కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ చట్టం–2025 (యాక్ట్ 15 ఆఫ్ 2025) ప్రకారం ఎస్సీ ఉప వర్గీకరణను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కార్మిక వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 14న గెజిట్ ద్వారా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి ఉద్యోగాలు, పదోన్నతులు, విద్యా రంగాల్లో ఎస్సి వర్గాలను గ్రూప్–I, గ్రూప్–II, గ్రూప్–IIIలుగా విభజించి రిజర్వేషన్లను అమలు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో పదోన్నతుల విషయంలో ఈ విధానాన్ని పాక్షికంగా అమలు చేస్తున్నప్పటికీ, ముఖ్యంగా NCWA ఉద్యోగుల ప్రమోషన్లలో మాత్రం ఎస్సి ఉప వర్గీకరణను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రమోషన్లలో రిజర్వేషన్లు సరిపోతున్నాయా లేదా అన్నది లెక్కించేటప్పుడు మొత్తం 15 శాతం కలిపి కాకుండా, ప్రతి కేడర్లో ఉప వర్గాల వారీగా లెక్కించాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సింగరేణిలో ఆ విధానం అనుసరించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఉద్యోగుల పర్సనల్ ఫైళ్లు, సర్వీస్ రికార్డుల్లో ఎస్సి ఉప వర్గాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయకపోవడం కూడా చట్టం అమలులో మరో పెద్ద లోపంగా ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ అంశంపై సింగరేణి కాలరీస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉద్యోగుల సంక్షేమ సంఘాలు యాజమాన్యానికి పలుమార్లు వినతులు సమర్పించినట్లు సమాచారం.
చట్టం అమల్లోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్నప్పటికీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ ఉప వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల చట్టం ద్వారా లబ్ధిపొందాల్సిన ఉప వర్గాలకు న్యాయం జరగడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రమోషన్ విధానాలు, రోస్టర్ వ్యవస్థలను వెంటనే సవరించి చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సింగరేణి యాజమాన్యం నుండి అధికారిక స్పందన రావాల్సి ఉంది.