‘మా ఆస్తులు భద్రమేనా..? ఇది సగటు నగరవాసిని వేధిస్తున్న ప్రశ్న. ప్రైవేట్ ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో జనం బెంబేలెత్తుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ‘సార్ 40 ఏండ్ల కిందట ఇల్లు కొన్నా.. అప్పటి నుంచి ఇప్పటిదాకా టాక్స్‌లు.. కరెంట్ బిల్లు కట్టాను.. మా కూతురు పెండ్లి కుదరడంతో ఇల్లు అమ్మేద్దామని అడ్వాన్స్ తీసుకున్నా.. తీరా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేద్దామని ప్రయత్నిస్తే 22ఏ జాబితాలో చేర్చారని చెబుతున్నారు’.. ఇది ఓ తండ్రి ఆవేదన అయితే.. రెండేండ్లలో మూడు సార్లు అమ్మకాలు జరిగిన మా ఫ్లాట్ ఇప్పుడు 22(ఏ)లో చేర్చడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నిస్తేజం నెలకొంది. ‘ఎప్పుడూ కళకళలాడే మా ఆఫీసులో నెలరోజులుగా విచిత్రమైన పరిస్థితి ఉంది. మా ఇంటికి మార్కెట్ వ్యాల్యూ ఎంత అని రోజూ జనం వచ్చేవారు. అయితే ఇప్పుడు మా ఇంటిని గవర్నమెంట్ జాబితాలో ఎందుకు కలిపారు.. అంటూ జనం వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారంటూ.. ఉద్యోగులూ చెబుతున్నారు. ఇప్పుడు నగరంలో ఏ ఇల్లు నిషేధిత జాబితాలో ఉన్నదో తెలియని పరిస్థితి ఉంది. ఏండ్ల తరబడి పైసాపైసా కూడబెట్టుకొని సంపాదించుకున్న ఆస్తులపై హక్కులు కోల్పోవడంతో యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి 22ఏ పేరు విన్నంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఏండ్ల నుంచి కాపాడుకున్న భూములను లాక్కోవడం అన్యాయమంటున్నారు. కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడుతున్నారు.
– బంజారాహిల్స్, ఆగస్టు 12
జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక మండలాల్లోని కాలనీలు, బస్తీలతో పాటు అపార్ట్మెంట్ వాసులు 22(ఏ) జాబితాలో తమ ఆస్తులు చేర్చడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఎన్నో ఏండ్ల కిందట ఇండ్లు కట్టుకున్న వారి వద్దనుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు కొందరైతే.. సొసైటీ లే అవుట్స్‌లో స్థలాలు సమస్యలు లేకుండా ఉంటాయని భావించి ఇండ్లు కొన్నవారు మరికొందరున్నారు. వీరితో పాటు పేరు మోసిన బిల్డర్లు కట్టిన అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారు సైతం నెలరోజులుగా సాగుతున్న 22(ఏ) జాబితా వివాదంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
బుధవారం ‘నమస్తే తెలంగాణ’ బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించగా, పలువురు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. సుమారు 25 రోజుల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వందలాది మంది వచ్చి తమ స్థలాలు 22(ఏ) జాబితాలో చేర్చారని ఫిర్యాదులు చేస్తున్నారని, దీన్ని తొలగించాలంటే ఏం చేయాలని వాకబు చేస్తున్నారని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పేర్కొన్నారు.
22(ఏ) జాబితాలో ఎందుకు చేరిందో తమకు తెలియదని, షేక్‌పేట మండల అధికారులను, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను అడగాలంటూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చెబుతున్నారని, కలెక్టర్ ఆఫీసుకు వెళ్తే వారం రోజుల్లో సమస్యలు తీరుస్తామని చెప్పారని, మూడు వారాలు గడిచినా..సమస్య మాత్రం తీరలేదని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, పంజాగుట్ట. శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, షేక్‌పేట, టోలీచౌకి, బృందావన్ కాలనీ తదితర ప్రాంతాల్లో వేలాది మంది ఇదే సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిసింది.
షేక్‌పేట మండలంలో సుమారు 2వేల ఆస్తులు 22ఏ జాబితాలో చేరినట్లు అనుమానాలున్నాయని, ఖైరతాబాద్, అమీర్ పేట మండలాల్లో సైతం భారీగా ఆస్తులు నిషేధిత జాబితాలో చేరిపోవడంతో వారంతా సొంత ఆస్తులను అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చెబుతున్నారు. ‘తెలంగాణలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని ఏడేళ్ల కిందట షేక్‌పేట మండల పరిధిలోని కృష్ణానగర్‌లో 500 గజాల స్థలంలోని ఇల్లు కొన్నాను.
అమెరికాలో ఉండే మా కొడుకు పేరుతో లోన్ తీసుకుని ఇల్లు కొన్నాం. లాభం వస్తుందని ఇన్నాళ్లు వేచి ఉన్నాం.. మూడేండ్ల నుంచి రియల్ ఎస్టేట్ కుప్పకూలడంతో పెట్టిన డబ్బులు అయినా వస్తే చాలని రెండునెలల కిందట ఇంటిని అమ్మకానికి పెట్టాం. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ సైతం తీసుకున్నాం. మా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి అమెరికాకు వెళ్లిపోవాలని నెలరోజుల కిందట స్లాట్ బుకింగ్ చేసేందుకు వెళ్తే మీ 22(ఏ) జాబితాలో చేరిందని రిజిస్ట్రేషన్ అధికారులు చెప్పారు.
నెలరోజుల నుంచి కలెక్టర్ ఆఫీసుకు, షేక్‌పేట మండల కార్యాలయానికి చక్కర్లు కొడుతున్నాం. 1986 నుంచి ఉన్న ప్రైవేటు ఇల్లు ఇప్పుడు ఎలా ప్రభుత్వానిది అయిందో ఎవరూ చెప్పడం లేదు.. అంటూ అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కళకళలాడే మా ఆఫీసులో నెలరోజులుగా విచిత్రమైన పరిస్థితి ఉంది. మా ఇంటికి మార్కెట్ వ్యాల్యూ ఎంత అని రోజూ జనం వచ్చేవారు. అయితే ఇప్పుడు మా ఇంటిని గవర్నమెంట్ జాబితాలో ఎందుకు కలిపారు.. అంటూ జనం వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు.
మాకు సంబంధం లేకున్నా జనం వచ్చి మమ్మల్ని బూతులు తిడుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. రెండేండ్లలో మూడు సార్లు అమ్మకాలు జరిగిన మా ఫ్లాట్ ఇప్పుడు 22(ఏ)లో చేర్చడమేంటని కొంతమంది ప్రశ్నిస్తుంటే.. ఇన్నాళ్లు టాక్స్‌లు కట్టించుకున్నారు.. కదా ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఎలా.. అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారని బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి చెప్పారు.
షేక్‌పేట మండలంలో 22ఏ జాబితాలో చేర్చిన సుమారు 30 ఫిర్యాదులు కలెక్టర్ కార్యాలయం నుంచి తమకు చేరాయని, వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన జిల్లా కలెక్టరేట్లోని అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఇదే అదనుగా కొంతమంది పైరవీకారులు రంగంలోకి దిగి ఫైల్ క్లియర్ చేయడం కోసం రేటు మాట్లాడుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఆస్తిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన పూర్తిగా తప్పని. కలెక్టరేట్‌కు వస్తున్న ఫిర్యాదులు సూచిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిషేధిత జాబితాలో ప్రైవేటు ఆస్తులు చేర్చడంతో జనంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తున్నదని అధికారపార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను చెల్లిస్తూ శాశ్వత నిర్మాణాలు కలిగిన వారికి చెందిన ఆస్తులను బేషరుతుగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని,లేకుంటే జనం రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.