మహబూబ్‌నగర్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హకీంపేట పారిశ్రామిక పార్కు అక్రమాలను వెనుక ఉండి ఓ అదృశ్యశక్తి నడిపిస్తున్నదన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నది. బిగ్ షాడో అవతారమెత్తిన ఓ కాంగ్రెస్ నేత వెనుక కోట్లకు పడగలెత్తిన ఆ అదృశ్యశక్తి హస్తమున్నదని పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో చేపడుతున్న ఈ పార్కులో నిర్వాసితులకు జరిగిన అన్యాయాలు ఇలా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నమస్తే తెలంగాణలో వస్తున్న వరుస కథనాలతో బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకొంటున్నారు. మరోవైపు ఈ కారిడార్‌లో భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం కాకుండా మరో రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్య నేత నిర్ణయించిందన్న విషయం గుప్పుమంటున్నది. ఆ మేరకు భూములు కోల్పోయిన సుమారు 1,200 ఎకరాల కోసం పంపిన రూ.120 కోట్లు మాయంకావడం ఇప్పుడు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొందరు తమకు కావాల్సిన రైతులను ఇంటికి పిలిపించి కొందరికి రూ.3 లక్షలు, మరికొందరికి రూ.5 లక్షల చొప్పున నామమాత్రంగా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ నగదు అందని అత్యధిక రైతులు బిగ్ షాడోను నిలదీయడంతో ఈ భారీ డబ్బుల వ్యవహారం బయటపడినట్టు సమాచారం. నిర్వాసితులకు పరిహారంతోపాటు వెంచర్ అభివృద్ధి చేయడానికి భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్టు వినికిడి. టెండర్లో చూపించిన దానికి, ఇక్కడ జరుగుతున్న పనులకు పొంతనే లేదు. వెంచర్ డెవలప్మెంట్ కోసం ఎన్ని టెండర్లను ఆహ్వానించారు.. ఎంతమంది కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు.. అనే సమాచారం ఇవ్వడానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ అధికారి వెనుకా, ముందు ఆడటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇదిలా ఉండగా పారిశ్రామిక కారిడార్‌లో ఓ కాంట్రాక్టర్ నుంచి ఏకంగా మూడు కోట్ల గుడ్‌విల్ పొందిన విషయం గుప్పుమంటున్నది.
ఇవన్నీ ఒక ఎత్తయితే బిగ్ షాడో ఇంట్లో ముఖ్య నేత రాత్రిపూట మూడు, నాలుగు గంటలు రహస్యంగా భేటీ కావడం వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని విశ్వసనీయ సమాచారం. బాధితులకు పరిహారం ఇవ్వకుండా, అసలైన రైతులకు అరకొర పరిహారం అందించి, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ప్లాట్లలో కూడా అక్రమాలు చోటుచేసుకుంటున్నా, ఏకంగా వాటిని లాక్కొనే ప్రయత్నం చేస్తున్నా.. ఉన్నతాధికారులు మౌనం దాల్చడం వెనుక అదృశ్యశక్తి హస్తమున్నదని తెలుస్తున్నది. పారిశ్రామిక పార్కు అక్రమాలపై ప్లాన్ రచించింది ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరుగా బాధితులు తమకు జరిగిన అన్యాయాలను బయటపెడుతూ న్యాయం కోరుతున్నా అధికారులు న్యాయం చేస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
హకీంపేట పారిశ్రామిక పార్కులో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారంతోపాటు అక్కడ ఏర్పాటు చేస్తున్న వెంచర్లో ఒక ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నమ్మించి భూములు సేకరించారు. ఆ భూములకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని ఎక్కడికక్కడే ఆందోళన చేపట్టడంతో చివరకు కొందరు నేతలు నచ్చజెప్పి మరో రూ.10 లక్షలను అనధికారికంగా ఇస్తామని హామీ ఇచ్చినట్టు నిర్వాసితులు చెప్తున్నారు.

లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో సుమారు 1,200 ఎకరాల వరకు భూములు సేకరించారు. ఈ భూముల కోసం సుమారు రూ.120 కోట్ల అవుతాయి. వీటన్నింటినీ సర్ది బిగ్ షాడో చేతిలో పెట్టగా, కొందరు రైతులను ఇంటికి పిలిపించి రూ.3 లక్షలు, నాలుగు లేదా 5 లక్షల చొప్పున అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చారు. ఈ నగదు అందని చాలామంది తమకూ ఇవ్వాలని అడిగితే దాట వేస్తున్నట్టు సమాచారం. దీంతో చాలామంది రైతులు తమకు అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి ఇంతకాలం జరుగుతున్నా ఆ నగదు ఎవరికిచ్చినట్టు? మిగతా సొమ్ము ఏమైనట్టు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
పారిశ్రామిక కారిడార్‌లో భూములు కోల్పోతున్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి బిగ్ షాడో ఏకంగా రూ.3 కోట్ల గుడ్‌విల్ తీసుకొన్నట్టు ప్రచారం జరుగుతుంది. కారిడార్ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు మొదలుపెడితే సదరు బిగ్ షాడో కొంతమందిని పంపించి అడ్డుకొన్నట్టు చేసి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ గుడ్‌విల్ కూడా మూడో కంటికి తెలియకుండా అందిందని ప్రచారం. భూములు కోల్పోయిన గ్రామాల్లో మాత్రం నయాపైసా సదుపాయాలు కల్పించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నది. ముఖ్యనేతతో మాట్లాడి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కంటే ఎక్కువ గౌరవప్రదమైన పరిహారం ఇస్తానని మాటిచ్చిన ఈ బిగ్షాడో.. ఆ మేరకు అక్కడి నుంచి నగదు తెచ్చుకొని తమకు పంచకుండా దగా చేస్తున్నారని బాధిత రైతులు మండిపడుతున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న పారిశ్రామిక కారిడార్ వెనుక ఆ అదృశ్య శక్తి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఆ అదృశ్య శక్తి వెనుక ఉండటం వల్లే బిగ్ షాడో ముందుండి అక్రమాలకు తెరలేపినట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఓ వంటమనిషి వందల కోట్లకు అధిపతి కావడం వెనుక కూడా ఈ అదృశ్యశక్తి హస్తమున్నదా? అనే అనుమానాలూ కలుగుతున్నాయి. ఇదంతా ముఖ్య నేతకు తెలిసే జరుగుతుందా? అంత బలీయమైన అదృశ్య శక్తి ఎవరు? అనేది ఇప్పుడు కొడంగల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే ప్రాంతంలో చక్రం తిప్పుతున్న మరో ముఖ్య నేత ఈ అక్రమాలపై నోరు విప్పకపోవడం వెనుక కూడా అదృశ్య శక్తి ప్రభావమేనని తెలుస్తున్నది.
కొంతమంది ‘నమస్తే’ కథనాలను సదరు ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్తే… ఆ వంటోడి బాగోతం ఇంకా బయటపడాలి.. అన్నీ చూస్తున్నాను అని అన్నట్టు సమాచారం. హకీంపేట పారిశ్రామిక పార్కులో బాధితులకు పరిహారం ఇవ్వకుండా అనేక అక్రమాలకు పాల్పడటం, ఇచ్చిన ప్లాట్లను కూడా లాక్కోవడం, వెంచర్ డెవలప్మెట్ పేరుతో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నా.. ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థంకావడమే లేదు. ఈ అక్రమాల వెనుక అధికారుల హస్తం కూడా ఉండటంతో వాళ్లంతా సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని, సీబీసీఐడీ విచారణ జరిపించాలని, అక్రమాలకు బాధ్యులైన ఎవరినీ వదలొద్దని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
దుద్యాల మండలం హకీంపేట పారిశ్రామిక పార్కులో నిర్వాసితులకు జరిగిన అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడటంతో అనేక మంది రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. పారిశ్రామిక కారిడార్‌కు ఏడాది క్రితమే భూములు ఇచ్చినా ఇప్పటివరకు చాలామందికి అరకొర పరిహారమిచ్చి చేతులు దులుపుకొన్నారు. మరి కొంతమందికి ప్రభుత్వం ఇచ్చే పరిహారం కాకుండా ఎక్కువ ఇస్తామని నమ్మించి తీసుకొన్న భూములకు కూడా ఆ మేరకు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ బిగ్ షాడో రైతులు కాని వాళ్లతో వీడియోల్లో మాట్లాడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ నేతలే నవ్వుకుంటున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ నేతల ట్రాప్‌లో పడొద్దని కాళ్లు మొక్కి చెప్తున్నా సహకరించండి.. అంటూ వీడియోలు తీసి పెట్టడంతో జనం కూడా అవాక్కవుతున్నారు. ఏడాదిగా తిరుగని కార్యాలయం లేదు.. అడగని నేతలు లేరు.. ఎవరినీ పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడిన నేతలు.. ఇప్పుడు కారిడార్‌కు అడ్డంపడొద్దు సహకరించండి.. అంటూ వేడుకోవడం గమనార్హం. అక్రమాలపై భూబాధితులతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పెద్ద ఎత్తున హకీంపేటలో ధర్నాకు దిగడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. హుటాహుటిన అదే చౌరస్తాలో సాయంత్రం మందీ మార్బలంతో కొంతమందిని వెంటబెట్టుకొని రేవంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి చిత్రపటాలకు కొందరు క్షీరాభిషేకం చేశారు. ఇన్నాళ్లు గుర్తుకురాని ఈ అభిషేకాలు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.