ChatGPT : బోర్డు పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేయడానికి సిబ్బంది సహకరించారు. మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎగ్జామినేషన్ సిబ్బంది చాట్‌జీపీటీ (ChatGPT) ని ఉపయోగించి మరీ విద్యార్థులకు సమాధానాలు చెప్పినట్లు దర్యాప్తులో తేలింది. దాంతో మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసింది.
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దాంతో ఆ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తమ దర్యాప్తులో బీడ్ జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు.
పరీక్షలు జరిగిన సమయంలో ఎగ్జామినేషన్ సిబ్బంది చాట్‌జీపీటీలో చూసి విద్యార్థులకు సమాధానాలు చెప్పినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వారు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసినందుకు సదరు టీచర్లపై కఠిన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ మాస్ కాపీయింగ్‌కు సహకరించిన 81 మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించడానికి, బోర్డు పరీక్షల సమగ్రతను కాపాడటానికి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.