హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో దెబ్బకు రాష్ట్రంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారనున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. దాదాపు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుతుందని ఇప్పటికే అంచనా వేసింది. ఒకవేళ ఎల్ నినో మరింత తీవ్రంగా మారితే భారీగా సాగు తగ్గడం ఖాయమని తేల్చి చెప్పింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఎల్ నినో కారణంగా ఏఏ పంటల సాగు తగ్గుతుంది.. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా ఏ పంటల సాగు పెరుగుతుంది.. ఏ జిల్లాల్లో ఏ పంటలు సాగు చేయాలనే అంశాలతో నివేదికను రూపొందించింది.
ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు లేకపోవడంతో సాగు నీళ్లు కరువై పంటల సాగుపై ప్రభావం చూపుతున్నది. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. దీంతో బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. ప్రాజెక్టులన్నీ ఖాళీ కుండలను తలపిస్తున్నాయి. వెరసి పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ పరిస్థితులతో గత ఏడాదితో పోల్చితే పంటల సాగు భారీగా తగ్గే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ఏడాది 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా ఈ సీజన్లో ఇది 1.07 కోట్ల ఎకరాలకే పరిమితమయ్యే అవకాశమున్నదని అంచనా వేసింది. అంటే సుమారు 32.20 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గుతుందని స్పష్టం చేసింది. గత ఏడాది వానకాలంతో పోల్చితే 23శాతం సాగు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 73.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు నివేదికలో పేర్కొన్నది. గత ఏడాది ఇదే సమయానికి 78 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే గత ఏడాదితో చూస్తే 4.64 లక్షల ఎకరాల్లో పంటలు తక్కువగా సాగయ్యాయి.
ఎల్ నినో ప్రభావం ఎక్కువగా వరి సాగుపై పడుతున్నది. సాగునీరు అధికంగా అవసరముండే పంట కావడం, వర్షాలు లేకపోవడంతో వరి సాగు సగానికి సగం తగ్గే అవకాశం ఉన్నది. గత ఏడాది వానకాలంలో 70 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సీజన్లో 38.51 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యే అవకాశమున్నదని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంటే 31.38 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గుతుందని పేర్కొన్నది. ఇప్పటి వరకు 14.09 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడినట్లు తెలిపింది. పత్తి 4.77 లక్షల ఎకరాల్లో తగ్గనున్నది. గత ఏడాది 50.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఈ సీజన్లో 45.92 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఇక మక్కజొన్న 40వేల ఎకరాల్లో తగ్గే అవకాశమున్నది.
రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాలు, గ్రామాలు ఎల్ నినో బారిన పడుతున్నాయి. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 23 జిల్లాలో లోటు వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొంది. ఇక 360 మండలాల్లో లోటు వర్షపాతం, 39 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం, 183 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఇక గ్రామాల విషయానికొస్తే దాదాపుగా అన్ని గ్రామాలపై ఎల్ నినో ప్రభావం ఉన్నట్లుగా పేర్కొంది. అయితే ఇందులో 7939 గ్రామాలపై మధ్యస్థ ప్రభావం ఉండగా 892 గ్రామాలపై అత్యంత తీవ్ర ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నది. ఇక 2320 గ్రామాలపై తక్కువ ప్రభావం ఉన్నట్లుగా వెల్లడించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా వ్యవసాయశాఖ వెల్లడించింది.
