వరంగల్, జులై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే విషయం ఆదివారం వరంగల్ ఉమ్మడి జిల్లానే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు గ్రామస్థాయి కార్యకర్త వరకు అందరూ ‘అయ్యో’ అన్నవారే. సామాన్య ప్రజలే కాదు పార్టీ ప్రత్యేకించి ఉద్యమకారుల నుంచి రాజకీయవాదుల దాకా అందరిలోనూ ‘పెద్ది కోలుకోవాలి’ అన్న తపనే. ఉదయం 8 గంటల ప్రాంతంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర గుండెపోటుతో హనుమకొండలోని రోహిణి ఆస్పత్రిలో చేర్పించారు అనే విషయం బయటకు రావడంతో నర్సంపేట నియోజకవర్గం షాక్‌కు గురైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గులాబీ శ్రేణుల గుండెల్లో బండ పడ్డట్టు అయింది.
విషయం తెలియగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారుగా ఆస్పత్రికి చేరుకోవడం మొదలైంది. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని పెద్ది ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావుకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన హనుమకొండకు తరలివచ్చారు. ఆస్పత్రి ప్రాంగణానికి బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, పెద్ది అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది.
కృష్ణానదీ జలాల కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ నేతలు ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లాక ‘పెద్ది సుదర్శన్‌రెడ్డి’ అస్వస్థత విషయం తెలియగానే ఆ పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన హనుమకొండకు పరుగెత్తుకొచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వైద్యులతోనూ మాట్లాడి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రి వర్గాలు, వైద్యులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎవరైనా సీనియర్ డాక్టర్ అందుబాటులో ఉంటే అంబులెన్స్‌లో రావాలని, ఈ విషయమై కేసీఆర్ పర్సనల్‌గా రెక్వెస్ట్ చేశారని కేటీఆర్ డాక్టర్ మమతారెడ్డితో చెప్పారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ పోయేదాకా గ్రీన్‌చానల్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి సానుకూల నిర్ణయం రావడంతో దగ్గరుండి అంబులెన్స్‌లో ఎక్కించి.. తమ సహచరుడిని కాపాడుకోవాలనే తపనతో అదే వాహనంతో పరుగులు పెట్టారు. హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ మొదలయ్యేదాకా నాలుగైదు గంటలపాటు కేటీఆర్, హరీశ్‌రావు అన్నీతామై నడిపించారు.

10
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, శంభీపూర్‌రాజు, మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాసర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్‌నాయక్, బాల్క సుమన్, గాదరి కిశోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ట్రనాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, లింగంపల్లి కిషన్‌రావు, ముద్దసాని సహోదర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్ యాదవ్, వై సతీశ్‌రెడ్డి, లక్ష్మణ్‌బాబు, బడే నాగజ్యోతి, ఎల్లావుల లలితాయాదవ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉషాదయాకర్‌రావు, జోరిక రమేశ్, బండి రజనీకుమార్, వీరేందర్, ప్రశాంత్ తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా, నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రికి తరలివచ్చారు.
పెద్దికి అస్వస్థత అన్న విషయం తెలియగానే పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు కదిలి వచ్చారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు ఆస్పత్రికి వచ్చి పెద్దిని పరామర్శించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ టీ రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, పార్టీ నేతలు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి సహా ఇతర పార్టీల నేతలు వచ్చి పరిస్థితిని ఆరా తీశా రు. ఆస్పత్రికి వచ్చిన దాదాపు ప్రతి ఒక్కరూ ‘నిన్ననే మాట్లాడాం. మొన్ననే మా తో మాట్లాడారు.. ఇంతలోనే ఏమైంది? ‘పెద్దన్న’ అనారోగ్యానికి గురి కావ డం ఏమిటి?’ అని కలవరపాటుకు గురయ్యారు. పెద్ది త్వరగా కోలుకోవాలని అందరిలో బలమైన ఆకాంక్ష వ్యక్తమైంది. నర్సంపేట నియోజకవర్గం లో అయి తే దాదాపు అన్ని మండలాల్లోని ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పెద్ది త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆయనకు హైదరాబాద్‌లో అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్‌ను ఆదేశించారు. మరోవైపు సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. కేటీఆర్, హరీశ్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేశారు. అలాగే, హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి వైద్యులతోనూ మాట్లాడి అవసరమైన చికిత్స చేయాలని కోరారు.