KTR | హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ నికృష్ణ పరిస్థితిని తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ కలిసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు మఫ్టీలో వచ్చి అక్రమంగా కిడ్నాప్ చేసి భయానక వాతావరణం సృష్టించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటూ కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కేసు ఏందో చెప్పకుండా అరెస్ట్ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు.
స్థానిక ఎంపీ అయిన డీకే అరుణ లగచర్ల గ్రామానికి వెళ్తానంటే కూడా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. కానీ వార్డు మెంబర్ కూడా కానటువంటి కేవలం ముఖ్యమంత్రి అన్న అనే ఒకే అర్హత కలిగినందుకు తిరుపతి రెడ్డిని మాత్రం లగచర్ల గ్రామానికి 300 మందితో వెళ్లనిచ్చారు. తిరుపతి రెడ్డి లగచర్ల గ్రామంలో తన అనుచరులతో స్వైర విహారం చేస్తూ భూములు ఇస్తేనే మీ వాళ్లను విడుదల చేస్తామంటూ ఇంటింటికి వెళ్లి ప్రజలను బెదిరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
భూమిని కోల్పోతామని బాధపడుతున్న గిరిజన, దళిత, బీసీ రైతులను జైళ్లలో పెట్టి వాళ్లను కొడుతూ చిత్ర హింసలు పెట్టిన నికృష్ట ప్రభుత్వం ఇది. ఒక ఇంట్లో మహిళ ఛాతిపై కాలితో తొక్కి ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారు. గతంలో ఏ నియంత, అప్రజాస్వామిక పాలకుడు కూడా చేయని దుర్మార్గ వ్యవహారం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్నారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నామన్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ సహా పోలీసులు గుర్తించాలని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ముఖ్యమంత్రికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది : హరీశ్‌రావు
Patnam Narendar Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్..
KTR | అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకే ఢిల్లీకి వెళ్లాను : కేటీఆర్
KTR | కొడంగల్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరతం పడుతాం.. హెచ్చరించిన కేటీఆర్