Harish Rao | నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు పరిశీలించారు.
వడ్లు కొనకపోతే అధికారులను మిల్లర్లను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కానీ.. మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు. మందు అమ్మకాల టార్గెట్ పెట్టి జనాలకు మందు ఎక్కువ తాగించి ఆదాయం పెంచాలని ఒత్తిడి చేస్తూ మెమోలిస్తూ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. 25 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మెమోలు జారీ చేశారు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మద్యాన్ని ఏరులై పారిస్తామని కంకణం కట్టుకున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు.
తెలంగాణలో ఆడబిడ్డలకు రూ. 2500 ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చావు కానీ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసి మహిళల పుస్తెలు తెంపుతున్నావ్. మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమిస్తామని చెప్పి మోసం చేసావ్. వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మహిళలకు అందజేయడం లేదు. భర్తలకు మద్యం తాగించి ఇల్లు గుల్ల చేయాలని చూసి మహిళలను ఇబ్బంది పెడుతున్నావ్.
ముఖ్యమంత్రి ప్రజల గురించి కాకుండా పైసల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రైతులకు పెట్టుబడి సాయం అందిందా లేదా రుణమాఫీ జరిగిందా లేదా సకాలంలో బోనస్ అందించారా లేదా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశారా లేదా అనే సోది లేదు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ప్రభుత్వ పరిస్థితి చూస్తుంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం నుంచి దళారుల వచ్చి తెలంగాణలో రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని కొంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేశావ్. రేవంత్ రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నాడు. ధాన్యం కొనుగోలులోనే కాదు పత్తి కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 15000 రైతుబంధు రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | కొడంగల్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరతం పడుతాం.. హెచ్చరించిన కేటీఆర్
Harish Rao | రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల దళారుల పాలైన ధాన్యం.. మండిపడ్డ హరీశ్‌రావు
KTR | అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకే ఢిల్లీకి వెళ్లాను : కేటీఆర్