Allu Arjun | తెలుగు సినిమా, టెలివిజన్ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న నటి హరితేజ మరోసారి వార్తల్లో నిలిచారు. యాంకర్‌గా, సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, సహజ నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కూచిపూడి నృత్యకారిణిగా మంచి పట్టు ఉండటం ఆమెకు అదనపు బలంగా మారింది. సుమారు 20కి పైగా సీరియల్స్‌లో నటించిన హరితేజ, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్నపాత్రలు చేసినప్పటికీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అఆ చిత్రంలో మంగమ్మ పాత్ర ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ పాత్రతో నటిగా బలమైన ముద్ర వేసుకున్న హరితేజకు వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాలు వచ్చాయి.
ఇక బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఫైనల్ వరకు చేరుకోవడం ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. బిగ్‌బాస్ తర్వాత కూడా సినిమాలు, టీవీ షోలతో బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హరితేజ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాలో బన్నీ పక్కన నటించే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. “ఆ అవకాశం వచ్చినప్పుడు నా ఆనందానికి హద్దులే లేవు” అని మురిసిపోయారు. అల్లు అర్జున్ పక్కన తాను స్లిమ్‌గా, పర్ఫెక్ట్గా కనిపించాలని ఓ నిర్ణయం తీసుకున్నాను.. “డీజేలో ఛాన్స్ వచ్చిన తర్వాత వరుసగా 15 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకున్నాను. సాధారణ ఆహారం పూర్తిగా మానేశాను. దాంతో కొంత సన్నబడి సినిమాలో బాగానే కనిపించాను” అని చెప్పారు. షూటింగ్‌కు ముందు రోజు ఉత్సాహంతో నిద్ర కూడా పట్టలేదని తెలిపారు.
సెట్లో జరిగిన ఒక సంఘటన తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమని హరితేజ భావోద్వేగంగా చెప్పారు. “సెట్లోకి వెళ్లగానే అల్లు అర్జున్ గారు నేరుగా నా దగ్గరకు వచ్చి ‘బిగ్ బాస్‌లో నీ పెర్ఫార్మెన్స్ చూశాను. నీ వర్క్ చాలా నచ్చింది’ అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు ఆకాశంలో ఎగిరినట్టుగా అనిపించింది” అని గుర్తుచేసుకున్నారు. ఒక స్టార్ హీరో తన పనిని గుర్తుంచుకుని అభినందించడం తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని తెలిపారు.