BRS Leaders | హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ నేతలు డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, వివేకానంద గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నారు.
డీజీపీ జితేందర్‌ను కలిసిన అనంతరం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసుల ఎదుటే.. కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ పోలీసులు చోద్యం చూస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ గూండాల దాడులపై ఇప్పటి వరకు డీజీపీకి నాలుగుసార్లు ఫిర్యాదు చేశామన్నారు. హరీశ్‌రావు దాడులు చేసిన వారిపై కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై చేసిన సవాల్‌కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించి దాడులకు పాల్పడ్డారు. కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో బయల్దేరిన అరికెపూడి గాంధీపై పోలీసులు చర్యలు తీసుకోలేకపోయారు. రాష్ట్రంలో పోలీసుల ప్రతిష్ట దిగజారిపోతోందన్నారు. కాంగ్రెస్ నాయకుల పుట్టినరోజు వేడుకలు పోలీస్ స్టేషన్లలో జరుపుకునే దౌర్భాగ్యం కాంగ్రెస్ పాలనలో నడుస్తుందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో పోలీసు వ్యవస్థతో పాటు మిగతా వ్యవస్థలను సీఎం రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ఉన్న హోదా రేవంత్‌కు తెలియదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. సీఎం కాకమ్మ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క భవిష్యత్తు కాపాడాలని, రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని డీజీపీని కోరామని జగదీశ్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Dasara Holidays | దసరా సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పట్నుంచంటే..?
KTR | కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు.. తప్పుబట్టిన కేటీఆర్