KTR | హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో విమర్శ కోసం విమర్శ చేయొద్దు.. మీ ప్రభుత్వంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందలేదని గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చురకలంటించారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
2014లో రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్‌తో అప్పజెప్పితే అప్పులపాలు, అప్పులకుప్ప చేశారని కాంగ్రెస్ నేతలు అనడం సరికాదు. 2014లో రెవెన్యూ సర్ ప్లస్ రూ. 369 కోట్లు. 2022-23లో రెవెన్యూ సర్ప్లస్ రూ. 5,944 కోట్లతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పాం. ఇది వాస్తవం కాదా..? మీరు ఇటీవల ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ 297 కోట్లు. తమకు రూ. 369 కోట్లతో అప్పజెప్పితే రూ. 5944 కోట్లతో అప్పజెప్పాం. ఇది తప్పా..? అప్పుల పాలైంది అని ఎలా అంటారు. జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థిక మంత్రి అనడం సరికాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారిని విశ్వమానవాళి ఎదుర్కోంది. 2019 చివరలో కరోనా వచ్చింది. 2020 మార్చిలో హైదరాబాద్‌కు వచ్చింది. అప్పట్నుంచి రెండేండ్ల పాటు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అందుకే అప్పటిదాకా జీతాలు చక్కగా ఇచ్చాం. ఆ తర్వాత కొంత ఆలస్యం జరిగింది. కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం జరిగింది. కరోనా వల్ల ఆర్థిక నష్టం జరిగినప్పటికీ కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్కు ఇచ్చే డబ్బులు ఆపొద్దని చెప్పి వాటికి ఇచ్చాం. ఉద్యోగులకు కొందరికి జీతాలు ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చు. నిన్న సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే హరీశ్రాబు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లకు 10 నెలలుగా జీతాల్లేవు అని చెప్పారు. విమర్శ కోసం విమర్శ చేయొద్దు. ఆలోచించండి అని కేటీఆర్ భట్టి విక్రమార్కకు సూచించారు.
అప్పులు రెవెన్యూ రిసిట్స్‌కు లోబడి ఉన్నాయి. రెవెన్యూ సర్‌ప్లస్‌లో ఉన్నామంటే జీతాల కోసం అప్పులు చేసే పరిస్థితి లేదు. ఎస్వోటీఆర్లో అంటే సొంత వనరుల్లో తెలంగాణ టాప్‌లో ఉంది. దయచేసి తప్పు ప్రచారం మానుకోండి. 6 లక్షల 71 వేల కోట్ల అప్పు ఉందని దుష్ప్రచారం చేయడం సరికాదు. అప్పుల విషయంలో హరీశ్‌రావు వివరంగా మాట్లాడారు. గ్యారెంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని వాటిని కూడా కలిపి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు అయిపోయాక కూడా ప్రతిపక్షంలో ఉండాల్సిన మోడ్‌లో ఉండకూడదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నికర అప్పు కేవలం 3 లక్షల 85 వేల 340 కోట్లు మాత్రమే. సభను, ప్రజలను తప్పుదోవ పడట్టించే ప్రయత్నం చేయకండి అని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | భారతదేశ భాగ్యరేఖలను మార్చే రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలబడింది : ఎమ్మెల్యే కేటీఆర్
KTR | భవిష్యత్‌లో భట్టి పక్క కుర్చీలోకి వెళ్లాలి.. మనసారా కోరుకుంటున్నాన్న కేటీఆర్
Srisailam project | నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తడంతో దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ