KTR | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆహా నా పెళ్లాంట సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని కేటీఆర్ ఎద్దెవా చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
ఇవాళ మనం డిజిటల్ యుగంలో ఉన్నాం.. ఇవాళ ఒక నిజం కడప దాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగిచ్చే పరిస్థితి. ఆహా నా పెళ్లాంట సినిమాలో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ పిసినారిగా ఉంటుంది. చికెన్ పెడుతా అని ఇంటికి కొందరిని పిలుస్తాడు. ఇక ప్లేట్లో అన్నం, చట్నీ వేసి.. ముందట కోడిని వేలాడదీస్తాడు.. ఇదే చికెన్ అని ఊరిస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు అలాగే ఉంది. ఆరునూరైనా సరే.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం, చేసి చూపెడుతా అని గంభీరమైన డైలాగులు కొట్టారు. ఇది చేస్తాం.. అది చేస్తాం.. పొడిచెస్తాం అని 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇవాళ 14వ నెల నడుస్తుంది. ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు. అబద్దాలు చెబితే కూడా అతికేలా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మాటలు వింటే నవ్వాలో ఏడ్వాలో తెలుస్తలేదు. రేషన్ కార్డులు జారీ చేయడం చారిత్రాత్మక కార్యక్రమం అని సీఎం మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదని చెబుతుండు. 2021 జులైలో రేషన్ కార్డులు ఇస్తూ తన సొంత నియోజకవర్గం మధిరలో భట్టి విక్రమార్క ఫొటోలు దిగారు. మన ప్రభుత్వంలో 6 లక్షల 50 వేలు రేషన్ కార్డులు ఇచ్చాం. మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఇచ్చాం. కానీ రేవంత్ లాగా ప్రభుత్వ పైసలతో ఆర్భాటాలు చేసి సన్నాయి నొక్కులు నొక్కలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెసోళ్లు గోబెల్స్ వారసులు. ఒకటి కాదు రెండు కాదు.. 420 హామీలు ఇచ్చారు. ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. విద్యార్థి డిక్లరేషన్ కూడా ఇచ్చారు. ఢిల్లీ నుంచి టూరిస్టులను తీసుకొచ్చి డిక్లరేషన్ల పేరిట ఊదరగొట్టారు. ఇవి నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్లను పట్టుకుని ఆఫిడవిట్లు తయారు చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఒట్లు పెట్టి డ్రామాలు ఆడారు. గ్యారెంటీ కార్డులు పంచారు. జోసెఫ్ గోబెల్స్ వారసుల మాదిరిగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిటిషన్